Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు . సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అటు, కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప, అటవీ, శిల్ప, ఫోటో ప్రదర్శన శాలలను తితిదే శుక్రవారం ప్రారంభించింది. ప్రవేశ ద్వారంలో ఉంచిన దుర్యోధన పరాభవం, శేషాచల శ్రేణుల సెట్టింగ్, శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ శిల్పకళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు తయారు చేసిన చెక్క, సిమెంట్, లోహ శిల్పాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రాబాబు
తిరుమల శ్రీవారికి సీఎం చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం వెండి పళ్లెంలో పట్టువస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి అనంతరం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
వదంతులు నమ్మొద్దన్న టీటీడీ
తిరుమలలో అపచారం జరిగిందన్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా కొక్కి విరిగిందని.. అపశ్రుతి చోటు చేసుకుందని వస్తోన్న వార్తలపై స్పష్టత ఇచ్చింది. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని.. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మొద్దని స్పష్టం చేసింది. ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని సోషల్ మీడియాలో విస్తృతంగా వదంతులు వస్తున్నాయి. శ్రీవారి భక్తులు ఇలాంటి వార్తలు నమ్మొద్దు. సాధారణంగా బ్రహ్మోత్సవాలకు ముందే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీ అని టీటీడీ స్పష్టం చేసింది. అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రసార మాధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరం. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని టీటీడీ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com