ఓట్లెయడానికి వెళ్తూ పట్టుబడ్డారు.. ఓట్లేసి వస్తూ దొరికిపోయారు..!

ఓట్లెయడానికి వెళ్తూ పట్టుబడ్డారు.. ఓట్లేసి వస్తూ దొరికిపోయారు..!
వాడెవరో విశాఖ జిల్లాలో ఓ ఇంట్లో చొరబడి ఆరుగురు అమాయకుల్ని అడ్డంగా నరికేశాడు. ఇది కక్షలతో చేసిన వ్యక్తుల హత్య. అక్కడ.. వాడిని అరెస్ట్‌ చేశారు

వాడెవరో విశాఖ జిల్లాలో ఓ ఇంట్లో చొరబడి ఆరుగురు అమాయకుల్ని అడ్డంగా నరికేశాడు. ఇది కక్షలతో చేసిన వ్యక్తుల హత్య. అక్కడ.. వాడిని అరెస్ట్‌ చేశారు. ఇక తిరుపతికి వస్తే... మొన్న బైపోల్ సందర్భంగా దొంగ ఓటర్లు పోటెత్తి దండయాత్ర చేశారు. ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో ఖూనీ చేశారు. ఇది పక్కా ప్లాన్‌ ప్రకారం వ్యవస్థను హత్య చేసాలా జరిగిన కుట్ర. ఆ రోజు ఉదయాన్నే కొందరు దొంగ ఓట్లెయడానికి వెళ్తూ పట్టుబడ్డారు.. మరికొందరు ఓట్లేసి వస్తూ దొరికిపోయారు.. స్వయంగా అభ్యర్థులే దొంగ ఓటర్లను గుర్తించి పట్టుకున్నారు. కిరాయి ఓటర్లు మీడియా సాక్షిగానూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఓటర్ల బాగోతంపై లెక్కకు మించి వీడియోలున్నాయి. మరి ఈ బ్యాచ్‌పై చర్యలెప్పుడు? ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి?

తిరుపతిలో పోలింగ్ రోజు 250 బస్సుల్ని తిప్పి పంపామని పోలీసులే ప్రకటించారు.. హత్య చేయడానికి ఓ వ్యక్తి వెళ్తూ పోలీసులకు పట్టుబడితే ఏం చేస్తారు? వాడిని లోపలేస్తారు కదా.. ఎక్కడి నుంచి వస్తున్నావు.. చేతిలో ఆ కత్తెందుకు.. ఎవరిని హత్య చేయడానికి వెళ్తున్నావంటూ విచారణ జరుపుతారు కదా.. మరి, 250 బస్సుల్ని తిప్పి పంపామని చెబుతున్నా పోలీసులు.. వారిని పూర్తి స్థాయిలో విచారించారా..? ఆ బస్సుల్ని ఎందుకు సీజ్‌ చేయలేదు? దొంగ ఓటర్లపై విచారణ ఎందుకు జరపడం లేదని విపక్షాలు నిలదీస్తున్నాయి. దొంగ ఓటర్లను తరలించిన బస్సులను సీజ్ చేస్తారా లేదా అని నేతలు ప్రశ్నిస్తున్నారు. దొంగ ఓటర్ల తరలింపు వెనుక ఉన్న నేతలెవరు? అని పోలీసు యంత్రాంగం నిగ్గు తేల్చదా అంటూ విపక్ష నేతలంతా నిలదీస్తున్నారు.

ఇంతకీ తిరుపతి ఎన్నికలో దొంగ ఓట్ల భాగస్వాములెవరు? నకిలీ ఓటరు కార్డుల తయారీదారులెవరు? నకిలీ కార్డులు ఎక్కడ తయారు చేశారు? నకిలీ వెనుక ఉన్న ఆ బడానేతలెవరు? నీటి నిగ్గు తేల్చాల్సింది భారత ఎన్నికల సంఘమే కదా? మరి ఎందుకు ఇంకా మౌనంగా ఉందంటూ విపక్షాలు గొంతెత్తుతున్నాయి. ఎన్నిక రోజే విపక్ష పార్టీలన్నీ దొంగ ఓటర్ల దండుపై భారీగా ఫిర్యాదులు చేశాయి. ఐనా.. ఎన్నికల అధికారులెందుకు మౌనంగా ఉన్నారు?

మరి.. తిరుపతి ఎన్నికను రద్దు చేయాలన్న విపక్ష పార్టీల డిమాండ్‌పై ఎన్నికల సంఘం ఏం చేయబోతోంది? ఎన్నిక రద్దుపై నేడు నిర్ణయం తీసుకుంటారా?

Tags

Read MoreRead Less
Next Story