Tirupati Rains: తిరుపతిలో హై ఎలర్ట్.. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక..
Tirupati Rains (tv5news.in)
Tirupati Rains: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం తిరుపతి నగరాన్ని ముంచెత్తుతోంది. అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తిరుపతి సమీపంలో ఉన్న కొన్ని చెరువులు తెగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు. పాతబడిన ఇళ్లలో ఉండవద్దని సూచిస్తున్నారు. తిరుపతి, చిత్తూరుతో పాటు శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, పుత్తూరు పట్టణాల్లోనూ ఎడతెరిపి లేని వర్షం కురిసింది. .
ఎడతెరిపిలేని వర్షంతో రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంది. కాలువలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఆరణియార్ ప్రాజెక్టు నుంచి 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కపిలతీర్థం, మాల్వాడి గుండం జలపాతాలను చూసేందుకు పెద్ద ఎత్తున నగర ప్రజలతో పాటు పర్యాటకులు చేరుకున్నారు. సదాశివకోన రిజర్వాయర్‌కు వర్షపు నీరు చేరుకుంది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. తమిళనాడు తీరంవైపు వెళ్లే అవకాశం ఉందని, అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తిరుపతితో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com