Tirupati : తిరుమలలో కిడ్నాప్‌కి గురైన బాలుడు క్షేమం

Tirupati : తిరుమలలో కిడ్నాప్‌కి గురైన బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరాడు. కిడ్నాపర్ ఇంట్లోవాళ్లే బాలుడిని తీసుకొచ్చి అప్పచెప్పడంతో ఈ కథ సుఖాంతమైంది. పవిత్ర అనే మహిళ ఈనెల 3వ తేదీన తిరుమలలో పిల్లాడికి మాయమాటలు చెప్పి తీసుకువెళ్లిపోయింది. నేరుగా మైసూర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. పిల్లాడితో వచ్చిన కూతుర్ని చూసి షాక్‌కి గురైన ఆమె పేరెంట్స్ బాలుడి వివరాలు ఆరా తీశారు. ఎందుకు తీసుకొచ్చావని పవిత్రను ప్రశ్నించారు. ఆమె సమాధానం చెప్పకపోవడంతో బాబును తీసుకుని వారు తిరుమలకు వచ్చారు. అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో విజిలెన్స్ పోలీసులకు అప్పచెప్పారు. తమ కుమార్తెకు మతి స్థిమితం లేదని, అందుకే తీసుకు వచ్చిందని వారు వివరించారు.
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ గాలిస్తున్నా వీడని బాలుడు కిడ్నాప్ మిస్టరీ.. ఇలా అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ సుఖాంతం అయ్యేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పోలీసులు పిల్లాడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తిరిగి కొడుకును ఎత్తుకున్న ఆ తల్లి సంతోషానికైతే అవధుల్లేవు. అటు.. కిడ్నాపర్ ఎందుకు బాబును ఎత్తుకెళ్లింది, ఆమె తల్లిదండ్రులు చెప్తున్నట్టు పవిత్రకు నిజంగానే మతిస్థితిమితం లేదా, అసలు ఏం జరిగింది అనే దానిపై పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పవిత్రపై మైసూరు, మాండ్య, కేఆర్‌పురంలో మిస్సింగ్ కేసులు ఉన్నాయంటూ వారు చెప్తున్న సమాచారం నిజమో కాదో చెక్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com