మొత్తం బంద్.. మొంథా తుఫాన్ కు చెక్ పెడుతున్న కూటమి..

భయంకర మైన తుఫాన్ వచ్చేసింది. తీరాన్ని మొంథా తుఫాన్ దాటేసింది. ఏ క్షణం ఎలా విరుచుకుపడుతుందో అని భయపడేలోపే మన దగ్గరకు వచ్చేసింది ఈ మొంథా తుఫాన్. నిన్న రాత్రి 7.30 గంటల సమయంలో కాకినాడ తీరాన్ని తాకింది. రాత్రంతా తుఫాన్ బీభత్సం కొనసాగుతూనే ఉంది. తెల్లారేసరికి తుఫాన్ ఏపీని కమ్మేసింది. తుఫాన్ బీభత్సానికి చాలా చోట్ల చెట్లు విరిగాయి. పంటలు ధ్వంసం అయ్యాయి. కరెంట్ స్థంభాలు విరిగాయి. రోడ్లు చెల్లాచెదురు అయ్యాయి. చాలా ఇండ్లు నేలకూలాయి. ఇంతటి విపత్తును ఎదుర్కునేందుకు ఏపీ సర్కార్ సర్వ శక్తులు ఒడ్డుతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా సీఎం చంద్రబాబు అధికారులతో టచ్ లో ఉంటున్నారు.
తీర ప్రాంతాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు అధికారులను అలర్ట్ చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో వసతులపై ఆరా తీస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశాలు చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అలర్ట్ గానే ఉంది. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయి. రెస్క్యూ టీమ్ లో రంగంలోకి దిగాయి. కూలిన చెట్లను తొలగిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. వాహనదారులకు ఇబ్బందులు కాకుండా భోజనం, వసతి ఏర్పాటు చేశారు.
బాధితులకు ఇబ్బందులు కలగకుండా హైజెనిక్ ఫుడ్, వసతి కల్పిస్తున్నారు. తీర ప్రాంతాల్లోని గర్భిణులను ఇప్పటికే తరలించారు. మొత్తం తీర ప్రాంత జిల్లాలను షెడ్ డౌన్ చేసి ఎవరినీ బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బీచ్ లు అన్నీ మూసేశారు. ఒక రకంగా కర్ఫ్యూ లా కనిపిస్తోంది. అందరూ ఇళ్లలో, వసతి కేంద్రాల్లోనే ఉన్నారు. ఎవరినీ బయటకు రానివ్వట్లేదు. ఒక్క ప్రాణం కూడా పోకూడదని సీఎం చంద్రబాబు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. అవసరం అయితే ఆర్మీని రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా అన్ని ఏర్పాట్లతో మొంథా తుఫాన్ ను ఎదుర్కోవడానికి ఒక యుద్ధమే చేస్తోంది కూటమి ప్రభుత్వం. కాబట్టి ప్రజలు ఎవరూ రోడ్ల మీదకు రాకుండా ప్రాణాలను కాపాడుకోవాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

