TTD Action : అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు

తిరుమల-తిరుపతి దేవస్థానాల చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశంతో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు ప్రారంభించింది. టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూమతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను అధికారులు గుర్తించారు. హిందూమత సాంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి, టీటీడీలో ఉద్యోగం పొందిన కొందరు ఉద్యోగులు నేడు అన్యమతాన్ని ప్రోత్సహిస్తూ భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను దెబ్బ తీస్తున్నారని తెలిపారు. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే, టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుసంధాన విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్య క్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా వీఆర్ఎస్ కు ఇచ్చి బయటకు పంపాలని ఇటీవల టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com