Satish Kumar : సతీష్ హత్యపై మరోసారి సీన్ రీ క్రియేషన్.. దర్యాప్తు స్పీడప్

పరకామణి చోరీ కేసులో కీలక సాక్షిగా నిలిచిన టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ మృతి కేసు రోజురోజుకూ సంచలన మలుపులు తీసుకుంటోంది. ఆయన మరణంపై అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే పోలీసులు నిన్న సీన్ ను రీ క్రియేషన్ చేసినప్పటికీ ట్రైన్ స్పీడ్ రాయలసీమ ఎక్స్ ప్రెస్ స్థాయిలో లేకకపోవడంతో నేడు మరోసారి అదే సన్నివేశాన్ని రీక్రియేట్ చేయేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ ప్రక్రియలో కొత్త కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక దర్యాప్తులో భాగంగా గుంతకల్ నుంచి తిరుపతి వరకు ఉన్న అన్ని రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.
సతీష్ చివరిసారి ఎక్కడ కనిపించాడో, రైలులో ఎవరి సమక్షంలో ఉన్నాడో, ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారో అన్న విషయాలను గుర్తించడానికి పోలీసులు విస్తృతంగా ఫుటేజ్‌ను చెక్ చేస్తున్నారు. సతీష్ వాట్సాప్ చాట్‌లు, కాల్ హిస్టరీ, ఫోన్‌లో ఉన్న ముఖ్యమైన డేటా కూడా ప్రస్తుతం దర్యాప్తు బృందం పరిశీలనలో ఉంది. ఏదైనా బెదిరింపులు వచ్చాయా? ఏదైనా వ్యక్తులతో వివాదాలు జరిగాయా? మరణానికి ముందు ఎవరెవరితో కమ్యూనికేట్ చేశాడన్న అంశాల్లో స్పష్టత కోసం డిజిటల్ ట్రేస్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
గురువారం రాత్రి 11 గంటల సమయంలో సతీష్ గుంతకల్ రైల్వే స్టేషన్‌కి చేరుకున్న తర్వాత జరిగిన కదలికలన్నీ ఇప్పుడు విచారణలో కీలకబిందువులుగా మారాయి. తిరుపతికి వెళ్లేందుకు ఆయన రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన విషయం తెలిసిందే. కానీ ఆ ప్రయాణంలో ఆయనకు ఏమైందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఆయన మృతి మాత్రం హత్య కోణంలోనే కనిపిస్తోంది. ఈరోజు జరగబోయే రీ క్రియేషన్, సీసీటీవీ వివరాలు, మొబైల్ డేటా విశ్లేషణతో కేసులో కీలక సమాచారాన్ని పోలీసులు బయటకు తీయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ప్రజల్లో ఈ కేసుపై భారీ ఆసక్తి నెలకొనడంతో, దర్యాప్తు బృందం మరింత జాగ్రత్తగా పనిచేస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

