TTD : కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి

TTD :  కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి
TTD : శ్రీవారి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.

TTD : శ్రీవారి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తర్వాత స్వామివారి దర్శనానికి క్రమంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేయాలని సంభందిత విభాగాధిపతులను బోర్డు అదేశించింది. ఇటీవల తిరుపతిలో జరిగిన భక్తుల తోపులాటలతో నిలుపుదల చేసిన స్లాటెడ్ సర్వదర్శన విధానాన్ని పునరుద్ధరించి, భక్తులకు టైంస్లాట్ టోకెన్లు కేటాయించాలని తీర్మానం చేసింది.. అలాగే టోకెన్లు లేని భక్తులను యధావిధిగా దర్శనానికి అనుమతించడంతో పాటు నడకదారి భక్తులకు కూడా మునుపటిలా దివ్యదర్శనం టోకెన్లు కేటాయించాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు పాలకమండలి సమావేశంలో మరిన్ని ఆజెండా ఆంశాలపై చర్చించి నిర్ణయాలు ప్రకటించారు.

గతేడాది చివర్లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంలో మరమ్మత్తులు పూర్తి చేసామని, మే 5 నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తామని తెలిపారు. అలాగే శ్రీవారి ఆలయంలో 2 కొత్త బంగారు సింహాసనాల తయారీకి 3.61 కోట్లు, తిరుపతిలోని శ్రీపద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాక్‌లు నిర్మించేందుకు కోటి 20 లక్షల నిధులను బోర్డు మంజూరు చేసింది. తిరుపతిలో శ్రీనివాస సేతు ఫస్ట్ ఫేస్ నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన నిర్మాణ పనుల కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించాలని బోర్డు తీర్మానం చేసింది‌‌. ఇక తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదమున్న ప్రాంతాల్లో మరమ్మత్తులతో పాటు రోడ్డు భద్రతా పనుల కోసం 20 కోట్లు కేటాయించినట్లు చైర్మన్‌ తెలిపారు. తిరుమలలో వివిధ ప్రాంతాల్లో ఉన్న గదుల మరమ్మమత్తులకు 19 కోట్లు నిధులు కేటాయించారు. తిరుమల కొండపై ఎలెక్ట్రిక్ బస్ స్టేషన్‌కు 2.86 ఎకరాలు స్థలాన్ని ఆర్టీసీకి కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది‌. ఇక తిరుమలలో రోజువారీ సేకరించే చెత్త వ్యర్థాలతో బయో గ్యాస్ తయారీ చేసి అన్నప్రసాదం తయారీకి వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు.

టీటీడీలోని విరాళాలు పద్ధతిలో మార్పులు చేసి, నగదు రూపంతో పాటు వస్తు రూపంలో విరాళమిచ్చిన దాతలకు కూడా దర్శన, వసతి వెసులుబాటు కల్పించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. టీటీడీ ఉద్యోగస్థుల ఇళ్ల స్థలాలు కేటాయింపుపై ప్రభుత్వంతో సమన్వయకర్తగా ఏఈవో స్థాయి అధికారిని నియమిస్తున్నట్లు చైర్మన్ చెప్పారు. ఇక తిరుమలలో ఇప్పటి దాకా కేటాయించిన దుకాణాలు, లైసెన్సులు క్రమబద్దీకరించి.. లీగల్ హైర్ చేయాలని బోర్డు తీర్మానం చేసింది.‌. తిరుమలకు మూడో మార్గంగా అన్నమయ్య మార్గం నిర్మాణానికి అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చాక మామండూరు మీదుగా మెట్లమార్గం నిర్మిస్తామని చైర్మన్ తెలిపారు. ఇక ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించిందని.. ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించేందుకు రేమండ్‌ సంస్థ అధినేత గౌతమ్‌ సింఘానియా ముందుకొచ్చారని.. 60 కోట్లు విరాళం ఇచ్చేందుకు దాత సిద్ధంగా ఉన్నారని చైర్మన్‌ చెప్పారు..

ఇక 240 కోట్ల రూపాయలతో టీటీడీ నిర్మించబోయే పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మే 5న సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు.. సీఎం పర్యటన పైనా పాలక మండలి సమావేశంలో చర్చించారు.. ఈ పర్యటనలో టాటా క్యాన్సర్ &అడ్వాన్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్‌ను సీఎం ప్రారంభిస్తారని ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story