TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. తిరుమలలో ఇక ప్రైవేట్ హోటల్స్ ఉండవు..

TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. తిరుమలలో ఇక ప్రైవేట్ హోటల్స్ ఉండవు..
TTD: శ్రీవారి దర్శనార్ధం నిత్యం దేశ నలుమూలల నుండి వేలాది భక్తులు తిరుమలకు చేరుకుంటారు.

TTD: శ్రీవారి దర్శనార్ధం నిత్యం దేశ నలుమూలల నుండి వేలాది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులకు ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానమే ఉచిత అన్నప్రసాదం అందించనుంది. సామాన్య భక్తులు మొదలుకొని ప్రముఖుల వరకు అందరికీ అల్పాహారం తో పాటు అన్న ప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలిలో నిర్ణయించినట్లు చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి స్పష్టం చేశారు.

ఇందుకోసం తిరుమలలోని పలుప్రాంతాలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను శరవేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గడిచిన రెండేళ్లు కరోనా ప్రభావంతో వ్యాపారాలు లేక నానా తిప్పలు పడిన ఆహార పదార్దాల విక్రయదారులకు టీటీడీ షాకిచ్చే నిర్షయం తీసుకుంది. టీటీడీ నిర్ణయంతో ఇకపై తిరుమల కొండపై ప్రయివేట్‌ హోటల్స్‌, ఫాస్ట్‌ ఫడ్స్‌, తినుబండారాలు విక్రయించే స్టాళ్లు మూతబడనున్నాయి.

విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించిన టీటీడీ.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దుకాణదారులకు సూచించింది. నిత్యం వేలాది మంది భక్తులకు టీటీడీ ఉచితంగా అన్నప్రసాదాన్ని గత మూడు దశబ్దాలుగా అందజేస్తోంది‌. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు దాతలు విరివిగా విరాళాలు అందిస్తుంటారు. కరోనాకు ముందు సాధారణ రోజుల్లో రోజుకు దాదాపు 45 వేల మంది టీటీడీ అన్నప్రసాదాన్ని స్వీకరించేవారు.

విశేష పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో ఈ సంఖ్య లక్షన్నర వరకు చేరుకుంటుంది. భోజనంతో పాటుపాలు, మజ్జిగ, మంచినీళ్లను కూడా టీటీడీ భక్తులకు అందజేస్తుండేది. ప్రస్తుతం కరోనా ఆంక్షలు సడలించడంతో క్రమంగా రద్దీ పెరుగుతోంది. టీటీడీ నిర్ణయంతో ఆందోళనలో పడిన ప్రవేటు హోటల్ యాజమానులు బాలాజీనగర్ లోని కమ్యూనిటీ హాల్ లో భేటీఅయ్యారు.

టీటీడీ బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం పై చర్చించుకున్నారు. బోర్డు నిర్ణయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని, బోర్డు నిర్ణయం వల్ల తమకు ఎదురయ్యే సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నట్లు వారు చెప్పారు. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో లను కూడా కలసి సానుకూలంగా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తామని అంటున్నారు ఫాస్ట్‌ ఫుడ్‌ నిర్వాహకులు.

అన్నప్రసాద వితరణ మరింత విసృత్తంగా భక్తులకు అందజేయాలే కానీ, ఇలా టీటీడీ అందజేసే ఆహారాన్ని మాత్రమే తినాలని భక్తులపై ఒత్తిడి చేయడం దుర్మార్గమని కాంగ్రెస్ నాయకుడు, రాయలసీమ పరిరక్షణ సమితి కన్వీనర్‌ నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తిరుమలకు వస్తారని, అందరి అభిరుచిలకు తగ్గట్టు ఆహారం అందించడం టీటీడీకి సాధ్యమా అని ప్రశ్నించారు.

తుగ్లక్ నిర్ణయాలు మానుకొని, చేతనైతే హోటల్స్‌లో, ప్రైవేటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అధిక ధరలను నియంత్రించాలని డిమాండ్ చేసారు. టీటీడీ నిర్ణయంపై అటు భక్తుల నుంచి ఇటు వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో టీటీడీ యాజమాన్యం.. ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తుందా? లేక భక్తుల సూచనల మేరకు సరసమైన ధరలతో ప్రయివేటు హోటళ్లను అనుమతిస్తుందా? వేచిచూడాలి..

Tags

Read MoreRead Less
Next Story