Srivari Mettu: శ్రీవారి మెట్టు నడకమార్గం పునరుద్దరణ ఎప్పటికి పూర్తయ్యేనో..?

Srivari Mettu: శ్రీవారి మెట్టు నడకమార్గం పునరుద్దరణ ఎప్పటికి పూర్తయ్యేనో..?
Srivari Mettu: దాదాపు 500 పైగా మెట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

Srivari Mettu: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తాదులు తిరుమల‌ కొండకు తరలివస్తుంటారు. ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల ఏదో పరిమిత సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారే కానీ.. సాధారణంగా రోజుకు 70 నుండి 85 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు.

వాహనాల్లో వెళ్లే వారు ఘాట్ రోడ్డులో ద్వారా తిరుమలకు చేరుకుంటుండగా, ఆ స్వామిపై అపారమైన భక్తిభావంతో గోవిందనామాలు స్మరించుకుంటూ మ్రొక్కుబడిగా మెట్టుమెట్టుకు నమస్కరించుకుంటూ వేల సంఖ్యలో భక్తులు పురాతన మార్గమైన నడకదారిలో ఏడుకొండలవాడి చెంతకు చేరుకుంటారు. తిరుమల చేరుకోవడానికి ఉన్నవి రెండు నడకమార్గాలు. ఒకటి అలిపిరి, మరోక్కటి శ్రీవారి మెట్టు మార్గం.

తిరుపతి నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి పట్టణానికి సమీపంలో ఉండేది ఈ శ్రీవారి మెట్టు నడకమార్గం, పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్న తరువాత సాక్షాత్తు ఆ స్వామిఅమ్మవార్లు కొండపైకి నడిచివెళ్లిన మార్గం కాబట్టే దానికి శ్రీవారి మెట్టు నడకమార్గంగా ప్రసిద్ధి చెందింది‌. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన నడకమార్గం గతేడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతింది.

దాదాపు 500 పైగా మెట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నాలుగు కల్వర్ట్‌లతో పాటు మెట్లకు ఇరువైపులా ఉండే రిటైనింగ్ వాల్స్ ధ్వంసమైపోయాయి. వరద ప్రభావంతో శ్రీవారి మెట్టు నడకమార్గం గుర్తుపట్టలేనంత.. పెద్దపెద్ద బండరాళ్లు, గుండులు, మట్టిపెళ్లలు, కొండచరియలతో నిండిపోయింది. తిరుమల చరిత్రలో మొదటిసారి మెట్లమార్గం‌ భారీస్థాయిలో దెబ్బతింది. దీంతో నవంబర్ 19వ తేదీ శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని TTD మూసివేసింది.

రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో శ్రీవారి మెట్టు నడకమార్గంతో సహా అలిపిరి నడకమార్గం కూడా కొంత దెబ్బతింది. తిరుమలపైకి ప్రయాణాలు సాగించే రెండవ ఘాట్ రోడ్డులో అయితే ఓ భారీసైజు బండరాయి విరిగిపడడంతో ఐదు చోట్ల రోడ్డు చీలిపోయింది.

అయితే అలిపిరి నడక మార్గాన్ని, రెండవ ఘాట్ రోడ్డులో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు, పునరుద్ధరణ పనులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చిన TTD.. అత్యంత ప్రాచీనమైన శ్రీవారి మెట్టు నడకమార్గం విషయంలో అలసత్వం వహించడం పలువురు భక్తులను, మెట్లమార్గంలో చిరువ్యాపారాలు చేసుకొని జీవించే స్థానికులను చాలా ఇబ్బందులు కల్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆలస్యం ఎందుకవుతుంది, ఎవరి నిర్లక్ష్యం వల్ల పునరుద్ధరణ పనులు మొదలుకాలేదనే ఆంశంపై సంబంధిత అధికారులతో టీవీ5 సంప్రదించి క్షేత్రస్థాయి వివరాలను సేకరించింది. ఊహించని రీతిలో దాదాపు సగానికిపైగా మెట్లమార్గం వరదలో కొట్టుకుపోగా, మార్గం మొత్తం బండరాళ్లు, మట్టితో నిండిపోయిందని.. వాటిని తొలగించడానికి నెలపైగా సమయం పట్టిందని చెప్పారు.

వాటన్నిటిని తొలిగించాక నష్టం అంచనా వేయడానికి మరికొన్ని రోజులు పట్టిందని.. మరో వందేళ్లలో ఎంత భారీవర్షం కురిసిన మెట్లమార్గం ఇసుమంత కూడా దెబ్బతినకుండా విధంగా పునరుద్ధరణ చేయాలన్న ఉన్నతాధికారుల అదేశాల మేరకు ఎన్.ఐ.టి వరంగల్ నుండి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లను పిలిపించామని, వారు నష్ట తీవ్రతను పరిశీలించి అందజేసిన స్ట్రక్చరల్ డిజైన్‌కు అయ్యే వ్యయానికి అంచనా వేసి టెండర్ పిలిచామన్నారు.

నాణ్యత ప్రమాణాలు పాటించి తక్కువ ఖర్చుతో మెట్ల మార్గం పునరుద్దరిస్తామని కోడ్ చేసిన తమిళనాడు ఈరోడ్‌కు చెందిన ఆర్.ఆర్‌ తులసి బిల్డర్స్‌కు 3.6 కోట్ల రూపాయలకు TTD తాజాగా టెండర్ ఖరారు చేసిందన్నారు. పెద్దసైజు బండారళ్లు వరదలో కొట్టుకొచ్చినా సులువుగా వెళ్లిపోయేలా 30 అడుగుల vent sizeతో నాలుగు కల్వర్ట్ లను.. దాదాపు 500 మెట్లు, మెట్లకు అడుగున స్టోన్ ఫ్లోరింగ్, అలాగే పలుచోట్ల రిటైనింగ్ వాల్స్ ను నిర్మించడంతో పాటు .. తెగిపోయిన వాటర్ పైపులైన్స్, విద్యుత్ తీగలను టెండర్ దక్కించుకున్న సంస్థ అమర్చనుందని తెలిపారు.

ఎత్తైన కొండ ప్రాంతల్లోని మెట్లమార్గంలో నిర్మాణ పనులు చేయడమంటే చాలా శ్రమతో కూడుకున్న పని అని.. నిర్మాణంలో వినియోగించే సిమెంట్, స్టీల్, ఇసుక, రాళ్లతో పాటు నిర్మాణ సామాగ్రిని మెట్లపైన మోసుకొని వెళ్లడానికి ఎక్కువ సమయం వృద్ధా అవుతుందన్నారు. ఈ క్రమంలో ఏప్రీల్ నెలాఖరు కంతా మెట్ల మార్గాన్ని పునరుద్దరిస్తామని TTD ఈవో జవహర్ రెడ్డి ప్రకటించడం ఇంజనీరింగ్ అధికారుల్లో ఒత్తిడిని మరింత పెంచిందనే చెప్పాలి.

ఈవో ప్రకటించినట్టు నిర్మాణ పనులు వేగంగా‌‌.. ధృడంగా పూర్తికావాలంటే మెట్ల మార్గానికి సమాంతరంగా నిర్మాణ సామాగ్రిని, పనిముట్లు, యంత్రాలను తరలించేందుకు ఒక తాత్కాలిక రహదారి ఏర్పరిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి TTD ఆ రకంగా ఆలోచించి చర్యలు తీసుకుంటుందో లేదో వేచిచూడాలి.

Tags

Read MoreRead Less
Next Story