TTD : అటవీ శాఖ అధికారులతో టీటీడీ సమీక్ష

తిరుమలలో అటవీ వృక్ష సంపద పెరుగుదల, మానవులు–వన్య ప్రాణుల సంఘర్షణ నివారణ చర్యలపై అటవీ శాఖ అధికారులతో టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలారావు గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో జరిగిన ఈ సమావేశంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీటీడీ డీఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు గత ఏడాది తిరుమలలో చేపట్టిన వృక్షారోహణ కార్యక్రమాలు, దశలవారీగా అకేసియా ఆరికులిఫార్మిస్ వృక్షాల స్థానంలో స్థానిక వృక్షజాతుల పెంపకం, ఔషధ వనాల అభివృద్ధి, సుస్థిర అటవీ పునరుద్ధరణ చర్యలు వంటి అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ఏడాదిలో లక్ష్యంగా పెట్టుకున్న 20 వేల మొక్కల్లో భాగంగా ఇప్పటివరకు తాండ్ర, రావి, ఉసిరి, వెలగ, జువ్వి, మర్రి, నేరేడు, అత్తి మరియు ఎర్రచందనం వంటి స్థానిక జాతుల 7,000 మొక్కలు నాటినట్టు వివరించారు. అదనంగా, వాటర్‌షెడ్ మరియు మట్టిస్థిరీకరణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు.
వన్యప్రాణుల నిర్వహణలో భాగంగా, అలిపిరి–తిరుమల మార్గాల రెండు వైపులా 60 కెమెరా ట్రాపులు, 31 సౌర శక్తితో నడిచే యాక్టివ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఈవో శ్రీ శ్యామలారావు అటవీ శాఖ అధికారులు మరింత ఆధునిక నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు తిరుమలకు సమగ్ర పర్యావరణ సుస్థిరత ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com