AP Weather: ఏపీలో ఇరవై రోజులు ఆలస్యమైన రుతుపవనాలు

ఈ సీజన్‌లో నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం చూపనుంది. నైరుతి మొదట్లో ఏపీ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఒక్క చిత్తూరు జిల్లాలోనే సాధారణ వర్షాలు పడగా, 17 జిల్లాల్లో సాధారణం కంటే చాలా తక్కువగా వర్షాలు కురిశాయి. 8 జిల్లాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది.ఇక నైరుతి రుతు పవనాలు గత రెండు వారాల్లో ఏపీ మినహా దేశంలోని చాలా రాష్ట్రాలకు విస్తరించాయి.కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వరదలు కూడా వచ్చాయి. అయితే రాష్ట్రానికి మాత్రం రుతుపవనాలు ఇరవై రోజుల ఆలస్యంగా వచ్చాయి.ఇక జూన్1 నే కేరళకు రావాల్సిన రుతు పవనాలు పది రోజుల ఆలస్యంగా వచ్చాయి. దీంతో రాయలసీమ రావటానికే ఆలస్యం అయింది.
మరోవైపు రుతుపవనాల జాప్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 52 శాతం వాన లోటు కనిపిస్తోంది. నంద్యాల,సత్యసాయి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిశాయి.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా,నెల్లూరు,శ్రీకాకుళం,మన్యం జిల్లాల్లో ఏకంగా 75 శాతం లోటుతో తీవ్ర వర్షాభావం నెలకొంది.ఉమ్మడి విశాఖ జిల్లా తిరుపతి,అన్నమయ్య, కడప,అనంతపురం, కర్నూలు,ప్రకాశం, పల్నాడు,బాపట్ల,గుంటూరు,ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో 50శాతం పైగా వర్షాభావం ఉంది.రుతు పవనాల రాకలో ఆలస్యంతో జిల్లాల్లో తొలకరి జల్లులకు రైతులు వేసిన పశుగ్రాస పంటలు, పచ్చిరొట్ట పైర్లు, నువ్వులు లాంటి తొలకరి పంటలు ఎండలకు మాడిపోయాయి.
ఇక ఇంతవరకు ఎండలు,వడగాల్పులతో ప్రజలు అతలాకుతలమయ్యారు. ఇప్పుడు రుతుపవనాలు విస్తరించినా.. భారీగా వర్షాలు కురుస్తాయన్న అంచనా లేదు.ఈ ఏడాది దేశవ్యాప్తంగా సగటు వర్ష పాతంలో నాలుగు శాతం లోటు ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇన్నాళ్లకు విస్తరించిన రుతుపవనాలతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న అంచనా లేదు. ప్రస్తుత ఖరీఫ్‌లో పంటల సాగుపై వాన ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖరీఫ్‌లో 86 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటికే 5లక్షల ఎకరాల్లో విత్తనాలు నాటాల్సి ఉండగా..కేవలం రెండున్నర లక్షల ఎకరాల్లోనే వరి,వేరుశనగ,పత్తి వంటి పంటలు సాగులోకి వచ్చాయని వ్యవశాఖ అధికారులు తెలిపారు.యావరేజ్‌గా మూడు శాతమే ఖరీఫ్ పంటలు సాగులోకి వచ్చాయి.ప్రస్తుతం ఖరీఫ్ సాగులో దాదాపు 20 రోజుల ఆలస్యం జరిగింది.దీంతో సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురిస్తేనే సాగు పుంజుకునే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com