Devaragattu: దేవరగట్టులో కర్రల సమరం...

Devaragattu: దేవరగట్టులో కర్రల సమరం...
ఒకరు మృతి, 100 మందికి గాయాలు..

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరిగింది. మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు కర్రల సమరం జరిగే సంగతి తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉత్సవంలో భాగంగా రెండు గ్రూపులు రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకోవడంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. కొందరి తలలు పగిలాయి. నెరణికి, నెరణికితండా, కొత్తపేట, సులువాయి, ఆలూరు, బిలేహాలు, విరుపాపురంత గ్రామాలవారు ఇందులో పాల్గొన్నారు. కాగా ఈ ఉత్సవానికి అనుమతి తీసుకోవడంతో పోలీసు యంత్రాంగం సీసీ కెమెరాల ద్వారా ఈ కర్రల సమరాన్ని పరిశీలించింది.

ఉత్సవాన్ని చూసేందుకు వచ్చి కొంతమంది స్థానికులు సమీపంలోని చెట్లు ఎక్కారు. ఎక్కువ మంది ఎక్కడంతో ఆ బరువుకు చెట్టు కొమ్మ విరిగి ఇద్దరు మృతి చెందారు. మృతులు ఆస్పరికి చెందిన గణేష్‌, కమ్మరచేడుకు చెందిన రామాంజనేయులుగా గుర్తించారు పోలీసులు. మరి కొందరు దుండగులు కాగడాల దివిటీలను గాల్లోకి ఎగరేయడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ కర్రల సమరంలో మొత్తంగా 100 మందికి గాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


కర్నూలు జిల్లా దేవరగట్టు గ్రామంలోని కొండపై ఉన్న మాల మల్లేశ్వరస్వామి ఆలయంలోని మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా పండుగ రోజు అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం నిర్వహించారు.తర్వాత కొండకు సమీపంలోని పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో మాళమ్మ, మల్లేశ్వరస్వామి విగ్రహాలను ఊరేగించారు. ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో దాడి చేసుకున్నారు.

ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పెద్ద చరిత్రే ఉంది. మాళమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే ఉత్సవాన్ని యుద్ధంలా జరుపుకుంటారు ప్రజలు. ప్రతి ఏటా జరుగుతున్న బన్నీ ఉత్సవంలో ప్రశాంతత నెలకొల్పడానికి పోలీసు, అధికారులు ప్రయత్నించారు. దేవరగట్టులో రక్తపాతం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈసారి బందోబస్తు ముమ్మరం చేశారు. అయినా సరే ఏదో ఒక సమస్య ఉండకుండా ఉండదు.

Tags

Read MoreRead Less
Next Story