Polavaram: పోలవరంపై కొత్త వివాదాలు.. తెలుగు రాష్ట్రాల మధ్య రగడ ..

Polavaram: పోలవరంపై కొత్త వివాదాలు.. తెలుగు రాష్ట్రాల మధ్య రగడ ..
Polavaram: పోలవరం ఎత్తుపై తెలుగు రాష్ట్రాల మధ్య రగడ మొదలైంది. ఆగిపోయిన వివాదం మళ్లీ రాజుకుంది.

Polavaram: పోలవరం ఎత్తుపై తెలుగు రాష్ట్రాల మధ్య రగడ మొదలైంది. ఆగిపోయిన వివాదం మళ్లీ రాజుకుంది. పోలవరం పంచాయితీలో కొత్త వివాదాలు.. సరికొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. పాత డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య పోలవరం కేంద్రంగా మాటలయుద్ధం రాజుకుంది. పోలవరం ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ భూభాగానికి ప్రమాదం ఉందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించాల్సిందేనంటూ మంత్రి పువ్వాడ అజయ్ తేల్చి చెప్పారు.

పోలవరం కోసం ఆంధ్రాలో విలీనం చేసుకున్న ఏడు మండలాల్లో కనీసం ఐదు గ్రామాలనైనా తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు పువ్వాడ. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. విలీన మండలాల్లోని ఐదు గ్రామాల ప్రజలు సైతం.. తమను తెలంగాణలో కలపాలని కోరుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు మంత్రి పువ్వాడ అజయ్. పోలవరం ఎత్తు విషయంలోనూ ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యహరించిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చి మూడు మీటర్ల ఎత్తు పెంచుకున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం తీరుతో భద్రాచలం దగ్గర 71 అడుగుల మేర వరద వస్తే.. గ్రామాల్లో 75 అడుగులు దాటి వరదనీరు ప్రవహించిందని సండ్ర గుర్తుచేశారు. దీని కారణంగా ఏపీలోని పలు గ్రామాల ముంపు బాధితులు సైతం.. తెలంగాణ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారన్నారు. పోలవరాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోకపోతే.. గిరిజన, ఆదివాసీ తెగలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే సండ్ర అన్నారు.

తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు స్పందించారు. తెలంగాణ మంత్రుల ఆవేదనపై వివరణ ఇవ్వాల్సిన ఏపీ మంత్రులు ఎదురుదాడికి దిగారు. తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్‌ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని.. గతంలా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని తాము అడిగితే బావుంటుందా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ఎదురు ప్రశ్నించారు మంత్రి బొత్స. ఇక అసలు విషయాన్ని వదిలేసి మంత్రి అంబటి రాంబాబు వితండవాదానికి దిగారు. విలీన మండలాల్లోని 5 గ్రామాలు తెలంగాణలో కలపాలన్న పువ్వాడ అజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. భద్రాచలం మాది అని మేమడిగితే తెలంగాణ ఇస్తుందా అని ఎదురు ప్రశ్నించారు.

తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. భద్రాచలం వరదలను ఎదుర్కోవడం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రోజూ గూగుల్ మ్యాప్‌లో ప్రాజెక్టులను చూసే సీఎం కేసీఆర్.. పోలవరం ఎత్తు పెంచుతుంటే ఎందుకు ఆపలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత మోదీ ప్రభుత్వం తెచ్చిన బిల్లులో.. లేని ఏడు మండలాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ధారాదత్తం చేసిందన్నారు. సత్వరమే భద్రాచలం వరద బాధితులకు న్యాయం చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మొత్తానికి ఇటు భద్రాచలం.. అటు కోనసీమను వరదలు ముంచెత్తిన వేళ ఏపీ, తెలంగాణ మధ్య పోలవరం పంచాయితీ, వరద రాజకీయాలు రాజకీయ దుమారం రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story