Vangaveeti Radha: తనను చంపేందుకే రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధ సంచలన వ్యాఖ్యలు..

Vangaveeti Radha: తనను చంపేందుకే రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధ సంచలన వ్యాఖ్యలు..
Vangaveeti Radha: తనను చంపేందుకు రెక్కీ చేశారన్న కామెంట్స్ కలకలం రేపాయి. త్వరలోనే వారెవరో కూడా బయటపెడతానంటూ.. సీజన్‌-2ను సస్పెన్స్‌లో పెట్టారు.

Vangaveeti Radha: వంగవీటి రాధాకు రక్షణ కావాలంటే భద్రత కల్పిస్తామంటూ ప్రకటించారు బెజవాడ పోలీసులు. వంగవీటి కుటుంబం నుంచి ఇప్పటి వరకు తమకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని పోలీసులు చెబుతున్నారు. వంగవీటి రంగా వర్దంతి వేళ తనయుడు రాధా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తనను చంపేందుకు రెక్కీ చేశారన్న కామెంట్స్ కలకలం రేపాయి. త్వరలోనే వారెవరో కూడా బయటపెడతానంటూ.. సీజన్‌-2ను సస్పెన్స్‌లో పెట్టారు.

వంగవీటి రాధ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పక్కనే ఉన్నారు. తన పైన రెక్కీ జరిగిందని రాధా చెప్పగానే.. అక్కడే ఉన్న మంత్రి కొడాలి నాని.. రాధా తనకు తమ్ముడు లాంటి వాడన్నారు. దీంతో.. రాధా ఎవరిని లక్ష్యంగా చేసుకొని ఈ విమర్శలు చేశారనే చర్చ మొదలైంది.

రెక్కీ జరిగింది వాస్తవమేనన్న రాధా.. వారెవరనే దానిపై మాత్రం చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. అయితే, కొన్ని సంఘటనలు ద్వారా వంగవీటికి స్కెచ్‌ వేయబోయింది ఎవరన్నది స్పష్టమవుతోంది. రాధాపై రెక్కీ చేసిన రోజే విజయవాడలో టీడీపీ నేత పట్టాభి, టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. పట్టాభి ఇంటిపై దాడి జరిగిన విషయాన్ని రాధాకు చెప్పారు అనుచరులు. అదే టైంలో ప్రత్యర్థుల కారు కనిపించడంతో దాన్ని ఒంటరిగా వెంబడించారు రాధా. దీంతో రాధాకు అనుమానం వచ్చిందని గ్రహించిన ప్రత్యర్థులు కారును వేగంగా పోనిచ్చారు.

కారు కనిపించకుండా పోవడంతో అక్కడి నుంచి నేరుగా పట్టాభి ఇంటికి వెళ్లిన రాధా.. వారిని పరామర్శించారు. ఈ లోపు రెక్కీ విషయం రాధా అనుచరులకు కూడా తెలిసి పోయింది. దీనిపై ఆందోళన చెందిన అనుచరులు రాధాకు ఫోన్‌ చేసి విషయం మొత్తం చెప్పారు. అయితే, దీనిపై ఎవరూ మాట్లాడొద్దని..అంతా తానూ చూసుకుంటానని ఆదేశించారు.

అపరిచితులు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారన్న విషయాన్ని నిన్నటి వరకు రాధా గోప్యంగా ఉంచారు. ప్రత్యర్ధుల రెక్కీని రాధా ముందుగానే పసిగట్టారు. మౌనంగానే ప్రత్యర్ధుల ఎత్తులు పైఎత్తులు గమనించారు. తన ప్రాణాలు తీయడానికి ప్రత్యర్ధులు సిద్ధమవుతున్నారని నిర్ధారించుకున్నారు. వంగవీటి రంగా వర్ధంతి వేళ సమయం, సందర్భం రావడంతో ఒక్కసారిగా బాంబు పేల్చారు.

వంగవీటి రాధాపై జరిగిన రెక్కీ వెనుక గుణదల గ్యాంగ్ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాధాపై రెక్కీ చేశారనే దానికి ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. అయితే రెక్కీ చేయడం మాత్రమే కాదు.. రాధాపై కొంతమంది దాడికి ప్రయత్నించారంటున్నారు ఆయన అనుచరులు. సుమారు గంటకు పైగా దుండగులు రాధా ఆఫీస్ చుట్టూ సంచరించారని చెబుతున్నారు. అంతేకాదు, వంగవీటి రాధా ఆఫీసును, పరిసరాలను ఫోన్‌లో రికార్డ్‌ చేశారు.

ఆ సమయంలో ఫోన్‌ మాట్లాడుతూ ఆఫీస్‌ నుంచి బయటికి వచ్చిన రాధా.. అపరిచితుల కదలికలను కనిపెట్టారు. వెంటనే రోడ్డుపైకి వచ్చారు. వారిని వెంబడించినప్పటికీ.. తప్పించుకు పారిపోయారు. మొత్తానికి రంగా చేసిన వ్యాఖ్యలు బెజవాడలో కలకలం రేపుతోంది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న బెజవాడలో మళ్లీ పాతరోజులు వస్తాయా? రక్త చరిత్ర సృష్టిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story