వాయుపుత్రుడు పుట్టింది తెలుగు నేలపైనే.. అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం..!

వాయుపుత్రుడు పుట్టింది తెలుగు నేలపైనే.. అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం..!
భజరంగబలి తిరుమలలోనే జన్మించారని చెప్పాలంటే.. ముందుగా తిరుమలకు అంజనాద్రి అనే పేరు ఎలా వచ్చిందో నిరూపించాలి. పండితులు అదే పని చేశారు.

వాయుపుత్రుడు పుట్టింది తెలుగు నేలపైనే. అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం. ఇకపై ఇదే ప్రామాణికం. వేరే రాష్ట్రాలు ఆంజనేయుడు మావాడే అని చెప్పుకునేందుకు అవకాశం లేని విధంగా.. శాస్త్రాలు, పురాణాలు, వేదాల్లో చెప్పిన అన్ని విషయాలను వెలికితీసి, పరిశీలించి, విశ్లేషించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆధారాలతో సహా నిర్ధారించింది. నాలుగు నెలల క్రితం పండితులతో కమిటీ వేసిన టీటీడీ.. పురాణ, వాంగ్మయ, శాసన, భౌగోళిక ఆధారాలను సమగ్రంగా విశ్లేషించింది. పురాణాల్లో ఏమని రాసి ఉంది, వాంగ్మయంలో ఏమని వర్ణించారు, శాసనాల్లో ఎలా చెప్పారు, భౌగోళికంగా స్వామి హనుమ పుట్టుక, తిరగాడిన ప్రదేశాలను ఎలా వివరించారన్న విషయాలను ఆధారాలతో సహా నిర్ధారించారు.

భజరంగబలి తిరుమలలోనే జన్మించారని చెప్పాలంటే.. ముందుగా తిరుమలకు అంజనాద్రి అనే పేరు ఎలా వచ్చిందో నిరూపించాలి. పండితులు అదే పని చేశారు. ఎందుకంటే, అంజనాదేవి హనుమకు జన్మనిచ్చిన కారణంగానే ఇప్పటి తిరుమల కొండకు త్రేతాయుగంలో అంజనాద్రి అనే పేరు వచ్చింది. ఈ వృత్తాంతం మొత్తం పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పారని బ్రహ్మాండ, వరాహ, భవిష్యోత్తర పురాణాల్లో వివరంగా ఉంది.

వాంగ్మయాలలో సైతం ఆంజనేయస్వామి జన్మస్థలంపైనా, తిరుమలకు అంజనాద్రి అనే పేరు రావడంపైనా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇందులో భాగంగా తమిళంలో రాసిన కంబ రామాయణాన్ని ప్రామాణికంగా చూపిస్తున్నారు పండితులు. ఇందులో అంజనాద్రిపైనే స్వామి హనుమ పుట్టారని, ఇక్కడే ఆయన తిరగాడారని స్పష్టంగా వివరించారు. ఎంతోమంది భక్తులు, పండితులు సైతం కొన్ని శతాబ్ధాల క్రితమే స్వామి హనుమ జన్మస్థలం అయిన అంజనాద్రి గురించి కీర్తించారని స్పష్టంగా చెప్పారు.

అన్నమయ్య కూడా శ్రీవేంకటేశ్వరుని స్తుతిస్తూ ఓ కీర్తన చేశారు. అందులో కూడా అంజనాద్రి రూపము అంటూ కీర్తిస్తారు. అంటే, ఒకప్పుడు తిరుమల కొండకు అంజనాద్రిగా పిలిచే వారు అనడానికి ఇది కూడా సాక్ష్యం అని చెప్పారు తిరుమల పండితులు.. శాసనాలలో సైతం అంజనాద్రి గురించి, స్వామి హనుమ జన్మస్థలంపై ఆధారాలు ఉన్నాయి. శ్రీరంగంలోని రంగనాథుని ఉత్సవ బేరాన్ని మహమ్మదీయులు ధ్వంసం చేయడానికి వస్తున్నారని తెలిసి.. రంగనాథస్వామిని తిరుమల కొండకు తరలించారు. కొన్నాళ్ల తరువాత తిరిగి శ్రీరంగంలో ప్రతిష్టించారు. ఆనాటి శాసనాల్లోనూ అంజనాద్రి నుంచి శ్రీరంగనాథున్ని తీసుకొచ్చినట్టు స్పష్టంగా ఉంది.

అన్నిటికంటే ముఖ్యం భౌగోళిక ఆధారాలు. కిష్కింధ, నాసిక్, జార్ఖండ్ అంటూ హనుమ జన్మస్థలంపై ఎన్నో ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రచారాలే తప్ప నిజం కావని రుజువు చేయాలంటే కావాల్సింది భౌగోళిక ఆధారాలే. స్కాంధ పురాణం ఆధారంగా వీటిని కూడా సేకరించారు పండితులు. స్వామి హనుమ పుట్టిన వెంటనే సూర్యున్ని పండుగా భావించి, రవి మండలానికి ఎగిరి వెళ్తారు. ఆ స్థలం ఎక్కడ అనేది సైంటిఫిక్‌గా నిరూపించారు.

అంతేకాదు, స్వర్ణముఖి నదికి 120 కిలోమీటర్ల దూరంలో తిరుమల కొండ ఉందంటూ అంజనా దేవికి మతంగి మహర్షి భౌగోళిక ఆధారాలతో వివరిస్తారు. ఇందులోనే స్వామి పుష్కరిణి, వరాహస్వామి, ఆకాశగంగ ఏయే ప్రాంతాల్లో ఉన్నదీ వివరిస్తారు. పురాణ, వాంగ్మయ, శాసన, భౌగోళిక ఆధారాలను విశ్లేషించిన టీటీడీ.. స్వామి హనుమ తిరుమలగిరుల్లోనే జన్మించారని నిర్ధారించింది. వేరే రాష్ట్రాల వాళ్లు చెప్పుకుంటున్నట్టుగా.. కిష్కింధ, నాసిక్, గుజరాత్, జార్ఖండ్‌లో స్వామి జన్మస్థలం లేదని ఆధారాలతో సహా వివరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story