ఏపీలో మండిపోతున్న ఎండలు..

ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఏప్రిల్ నెల మొదట్లోనే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. వడగాడ్పులు ఠారెత్తిస్తున్నాయి. దీంతో ప్రజలు సెగ, ఉక్కపోతతో ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో ప్రధాన రహదారులన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సాధారణం కన్నా 5నుంచి 9డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నా.. మైదాన ప్రాంతాల్లో మాత్రం అధిక ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. నేడు, రేపు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని.. దీంతో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత పెరిగినట్టు అంచనావేస్తున్నారు.
రాష్ట్రంలో అధిక ఉష్టోగ్రతలు నమోదైన ప్రాంతాలను పరిశీలిస్తే.. కందుకూరు 45.9, దొరవారిసత్రం 45.6, సీతానగరం 45.4, నింద్ర 45.1, తెనాలి 45.0, ఇబ్రహీంపట్నం 44.8, గుంటూరు 43.0, విజయవాడ 42.8, తిరుపతిలో 42.5 డిగ్రీలు నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com