VIJAYASAI: జగన్‌పై మళ్లీ విజయసాయి విమర్శలు

వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి జగన్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. రాజులు, రాజ్యాలు, కోటలు, కోటరీలు అంటూ విజయసాయి చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారని... కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదని.. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేదని అన్నారు విజయసాయిరెడ్డి. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేదని అన్నారు. కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడని... వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడని అన్నారు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలని.. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలని అన్నారు. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అంటూ విజయసాయి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
సీఐడీ విచారణ తర్వాత విమర్శలు
రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాని.. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని వైసీపీని వీడిన విజయసాయి రెడ్డి ఇటీవల కాకినాడ పోర్ట్ కేసులో సీఐడీ విచారణకు హాజరైన క్రమంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు చేసిన ట్వీట్ కూడా అదే జగన్ ను టార్గెట్ చేస్తూ ఉండటం సంచలనంగా మారింది.
విజయసాయి కుటుంబానికి మరో బిగ్ షాక్
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. విశాఖ జిల్లా భీమిలీ బీచ్ లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. విజయసాయి కుమార్తె నేహా రెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. CRZ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇసుక తిన్నెల్లో అక్రమ నిర్మాణాలను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com