VSR: జగన్ మళ్ళీ అధికారంలోకి రాడు: విజయసాయి రెడ్డి

వైసీపీ అంతర్గత రాజకీయాలు, నాయకత్వ శైలి, కోటరీ ప్రభావం వంటి అంశాలపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై జగన్ పార్టీ కుట్రలు చేస్తోందని, 2020 నుంచి తనను కావాలని పార్టీ నుంచి దూరం చేశారని ఆరోపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీ మాటలే పార్టీని ఈ దుస్థితికి తీసుకొచ్చాయని వ్యాఖ్యానించారు. కోటరీ ప్రభావం కొనసాగితే వైసీపీ ఎప్పటికీ మళ్లీ అధికారంలోకి రాలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి, తన రాజకీయ భవిష్యత్తు, వైసీపీ పరిస్థితి, జగన్ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ విచారణ దాదాపు ఏడు గంటల పాటు కొనసాగిందని, లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు.
కుట్రలు జరుగుతున్నాయి’
తనపై వైసీపీ వ్యవస్థాగతంగా కుట్రలు చేస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. 2020 తర్వాత తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారని, కీలక నిర్ణయాల నుంచి కావాలని పక్కన పెట్టారని అన్నారు. ఇదంతా కోటరీ రాజకీయాల ఫలితమేనని వ్యాఖ్యానించారు. జగన్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల మాటలు నమ్మడం వల్లే పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని, ఎన్నికల పరాజయానికి అదే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. తనపై జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాను పార్టీకి చేసిన సేవలను విస్మరించి, వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ఈ పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని చెప్పారు.
నా చేతుల్లోనే ‘నా రాజకీయ భవిష్యత్తు...
తన రాజకీయ భవిష్యత్తును తానే నిర్ణయించుకుంటానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి తాను తప్పుకోవడం లేదని, ఈ నెల 25తో రాజకీయాల్లో తనకు ఒక సంవత్సరం పూర్తవుతుందని తెలిపారు. ఆ తర్వాత తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. జూన్ నెల తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టంగా వెల్లడిస్తానని చెప్పారు. జగన్ మళ్లీ తనను ఆహ్వానిస్తే ఆ విషయంపై ఆలోచిస్తానని పేర్కొన్నారు. అయితే, అదే కోటరీ వ్యవస్థ కొనసాగితే మాత్రం వైసీపీలో మార్పు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. పార్టీని తిరిగి బలోపేతం చేయాలంటే నాయకత్వం చుట్టూ ఉన్న వర్గాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించిన విజయసాయిరెడ్డి, అధికారంలో ఉన్న కూటమి ఇలాగే కొనసాగినా, వైసీపీ మాత్రం తిరిగి అధికారంలోకి రావడం కష్టమని అన్నారు. ప్రజల్లో పార్టీపై ఏర్పడిన అభిప్రాయాన్ని మార్చుకోకుండా, అంతర్గత మార్పులు లేకుండా ముందుకు వెళ్లడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. కోటరీ రాజకీయాలే వైసీపీకి అతిపెద్ద శత్రువని మరోసారి స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
