AP: సూత్రధారి, పాత్రధారి ఆయనే: విజయసాయి

వైఎస్ జగన్ పై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ లో చాలా మార్పు వచ్చిందని స్పష్టం చేశారు. జగన్ కోటరి మాటలే వింటారని.. ఆ మాటలు వినొద్దని చెప్పానని విజయసాయి తెలిపారు. తన మనసు విరిగిపోయింది కాబట్టే పార్టీ నుంచి బయటకు వచ్చానని వెల్లడించారు. తాను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారని... అది తనను కలచివేసిందని విజయసాయి ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి, పాత్రధారి రెండూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అని కుండబద్దలు కొట్టారు. దీని గురించి మరిన్ని వివరాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. భయం అనేది తన బ్లెడ్‌లోనే లేదని... ఎవరికీ భయపడే రకం కాదని విజయసాయి తేల్చి చెప్పాడు. గతంలో నాయకుడిపై భక్తి, గౌరవం ఉండేదని.... ఇప్పుడు ఆ భక్తి దేవుడి మీద ఉందని వెల్లడించాడు. జగన్ తనకు పదవులు ఇచ్చాడు కాదనని... కానీ ఆ పార్టీలో అనేక అవమానాలు పడ్డానని తెలిపాడు.
జగన్‌తో విభేదాలు నిజమే
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు.. వైఎస్ జగన్ కు మధ్య విభేదాలు ఉన్న మాట నిజమేనని వెల్లడించారు. ఈ విభేదాలను కొందరు కావాలనే సృష్టించారని తెలిపారు. వైసీపీలో కొందరు ఎదగడానికి.. తనను కిందకు లాగారని విజయసాయి తెలిపారు. మళ్లీ వైసీపీ ఘర్ వాపసీ ఉండబోదని స్పష్టం చేశారు. జగన్ చుట్టూ ఓ కోటరి ఉందని.. ఆ కోటరీ వల్లే తాను వైసీపీకి దూరమయ్యానని తేల్చేశారు.
ఆ అవసరం నాకు లేదు
తన అల్లుడి కుటుంబ వ్యాపారాల్లో తాను ఎప్పుడు జోక్యం చేసుకోలేదని సీఐడీ విచారణ ముగిసిన అనంతరం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కేవీరావుతో ముఖ పరిచయం తప్ప ఎలాంటి లావాదేవీలు లేవని వెల్లడించారు. విక్రాంత్ రెడ్డిని కేవీరావుకు పరిచయం చేయాల్సిన అవసరం తనకు లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సీఐడీ అధికారులు చెప్పారని వివరించారు.
సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
విజయవాడ సీఐడీ కార్యాలయానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారు. కాకినాడ పోర్టులో వాటాలను బెదిరించి బదిలీ చేయించుకున్నారని కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. వాటాల్లో పాత్రదారులు, సూత్రదారులపై సీఐడీ ఆరా తీస్తోంది. విజయసాయిరెడ్డి మినహా మిగతా వారిని ఎవరినీ లోపలికి అనుమతించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com