Vijayawada : అంత్యక్రియలు పూర్తి.. తిరిగొచ్చిన మహిళ..!

Vijayawada : అంత్యక్రియలు పూర్తి.. తిరిగొచ్చిన మహిళ..!
బతికున్న మహిళను చంపేశారు. మృతదేహం మీదే అంటూ ఆంబులెన్స్ లోకి తీసుకెళ్ళి మరి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బతికున్న మహిళను చంపేశారు. మృతదేహం మీదే అంటూ ఆంబులెన్స్ లోకి తీసుకెళ్ళి మరి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కనిపించి కనిపించినట్లుగా ముఖాన్ని చూపించి కన్ఫామ్ చేయించుకున్నారు. అక్కడితో ఆగలేదు అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు ఆస్పత్రి సిబ్బంది. ఆమె చనిపోయిందని కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. చనిపోయిన ఆమెను గుర్తు చేసుకుంటూ గ్రామంలో ఫ్లెక్సీలు కూడా పెట్టకున్నారు. ఇది జరిగిన కొద్దిరోజులకు చనిపోయిందనుకున్న మహిళ తిరిగి వచ్చింది.

ఆమెను చూసి అంతా షాక్ అయ్యారు. దగ్గరుండి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే మళ్లీ ఎలా కళ్ళ ముందు ప్రత్యక్షమైందో అర్థం కాక ఆందోళనలో పడ్డారు. చివరకు తేలిందేమిటంటే ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కోలుకొని డిశ్చార్జ్ అయి వచ్చింది. మరి చనిపోయిన మహిళ ఎవరు..? దీనికి సమాధానం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చెప్పాలి. బతికున్న మహిళను చనిపోయిందని చెప్పి.. కుటుంబ సభ్యులకు అప్పగించి చేతులు దులుపుకున్న బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాహకం ఇప్పుడు సంచలనంగా మారింది.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట క్రిస్టియన్ పేట కు చెందిన ముత్యాల గిరిజమ్మకు కరోనా సోకింది. తీవ్ర అస్వస్థతకు గురైంది. దీనితో ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. గత నెల12న గిరిజమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. మూడు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. గిరిజమ్మ చనిపోయిందని చెప్పడంతో వారంతా నిశ్చేష్టులయ్యారు. చివరకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు ఆస్పత్రి సిబ్బంది. ఆమె ముఖం మాత్రం చూపించారు. మాస్క్ ఉండడం, పోలికలు కనిపించడంతో గిరిజమ్మగా భావించారు. ఆ వెంటనే అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.

చివరికి ఇవ్వాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ముత్యాల గిరిజమ్మ గ్రామానికి వచ్చింది. ఆమెను చూసి చనిపోయిన గిరిజమ్మ బతికి ఎలా వచ్చిందో అర్థం కాక అంతా అయోమయంలో పడిపోయారు. చివరకు ఆమె చెప్పిన వివరాలు అన్ని విని , చనిపోయింది గిరిజమ్మ కాదని నిర్ధారణకు వచ్చారు. గిరిజమ్మకు కరోనా సోకిన తర్వాత ఆమె కొడుకు ముత్యాల రమేష్ కూడా కరోనా సోకింది.. ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 23న రమేష్ చనిపోయాడు. ఇంట్లో ఇద్దరు కారోనాతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లోకొడుకు మృతి తట్టుకోలేక కుటుంబ సభ్యులు వారిని గుర్తు చేసుకుంటూ గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. చివరకు గిరిజమ్మ బతికే ఉందని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అసలు మరో మృతదేహాన్ని గిరిజమ్మ పేరుతో ఎలా అప్పగించారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా..? ఆసుపత్రిలో చేరినప్పుడు పేషంట్ వివరాలు నమోదు చేసుకొలేదా? అసలేం జరిగిందో గిరిజమ్మ కుటుంబ సభ్యులు ఆరాధిస్తున్నారు. కరోనా పేషెంట్ల విషయంలో బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని వారంతా మండిపడుతున్నారు.



Tags

Read MoreRead Less
Next Story