విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు విదేశీ రుణాలు

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌ఎల్) వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల కోసం అవసరమైన 12,000 కోట్ల రుణ సమీకరణపై కార్పొరేషన్ దృష్టి సారించింది. విశాఖపట్నం మెట్రోకు 6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు 5900 కోట్ల రుణం అవసరమని అంచనా వేసిన ఏపీఎంఆర్‌ఎల్ తక్కువ వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేసే విదేశీ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది.
ఈ నేపథ్యంలో ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) ప్రతినిధులతో ఏపీఎంఆర్‌ఎల్ ఎండీ రామకృష్ణారెడ్డి విజయవాడలోని తన కార్యాలయంలో సమావేశమయ్యారు. AIIB ప్రతినిధులు సంతోష్, పాస్కల్ రసెల్ విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు 26 కిమీ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు 12 కిమీ మార్గాలను సందర్శించిన వారు రుణాలు మంజూరు చేసేందుకు ఆసక్తి కనబరిచారు.
విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు రుణాలు అందించేందుకు AIIBతో పాటు జర్మనీకి చెందిన KFW, ఫ్రాన్స్‌కు చెందిన AFD, జపాన్‌కు చెందిన JICA, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB), ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ఈ బ్యాంకుల ప్రతినిధులు త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరపనున్నారు.
ఏపీఎంఆర్‌ఎల్ ఇప్పటికే జనరల్ కన్సల్టెంట్ నియామకం కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రుణ సమీకరణలో తక్కువ వడ్డీ రేటుతో పాటు ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా సహకరించే బ్యాంకులను గుర్తించేందుకు ఎండీ రామకృష్ణారెడ్డి మరిన్ని చర్చలు జరపనున్నారు. ఈ ప్రాజెక్టులు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడనున్నాయి.
రెండు నగరాల్లో మెట్రో రైలు సేవలు ప్రారంభమైతే రద్దీ తగ్గడంతో పాటు పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ దిశగా వేగంగా కృషి చేస్తూ రాష్ట్రంలో అత్యాధునిక రవాణా సౌకర్యాలను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com