Hyderabad : గూగుల్‌ పేతో మొదలైన లవ్‌ స్టోరీ.. ట్యాక్సీడ్రైవర్ కోసం లండన్ నుంచి హైదరాబాద్ కి.

Hyderabad : గూగుల్‌ పేతో మొదలైన లవ్‌ స్టోరీ.. ట్యాక్సీడ్రైవర్  కోసం లండన్ నుంచి హైదరాబాద్ కి.
X
ట్యాక్సీ డ్రైవర్‌ మాయమాటలకు ఆకర్షితురాలై .. దేశం కానీ దేశంలో పిల్లలను వదిలేసి వచ్చిన వివాహిత

ఓ ట్యాక్సీ డ్రైవర్‌ నుంచి వెళ్లిన మెసేజ్.. తనకు వివాహమై భర్త పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయేలా చేసింది. ఏకంగా లండన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చేలా రప్పించింది. భార్య కనిపించకపోవడంతో భర్తకు అనుమానం మొదలై విచారించగా.. ట్విస్ట్‌లు బయటపడ్డాయి. అసలేం జరిగిందంటే..

అల్వాల్‌ ప్రాంతానికి చెందిన భార్యా భర్తలకు 13 ఏండ్ల కుమారుడు, 12 ఏండ్ల కూతురు ఉన్నది. ఉద్యోగం కారణంగా భార్యా పిల్లలను ఇక్కడే ఉంచిన భర్త.. గతేడాది నవంబర్‌లో లండన్‌ వెళ్లాడు. అతడి భార్యా పిల్లలు, తల్లిదండ్రులను ఇక్కడే ఉంచాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సదరు మహిళ తల్లి మృతి చెందడంతో అస్థికలు కలిపేందుకు ఒక ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్లి, వచ్చింది. ఆ ట్యాక్సీ డ్రైవర్‌కు గూగుల్‌ పే ద్వారా డబ్బులు చెల్లించింది. ఆమె ఫోన్‌ నంబర్‌ను సేకరించిన ట్యాక్సీ డ్రైవర్‌.. నెమ్మదిగా ఆమెను పొగుడుతూ ట్రాప్‌లోకి దింపాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు లండన్‌లో ఉన్న ఆమె భర్తకు సమాచారమిచ్చారు.

హైదరాబాద్‌ టూ లండన్‌..

జాగ్రత్త పడ్డ భర్త.. సెప్టెంబర్‌ 16న భార్యా పిల్లలను లండన్‌కు రప్పించుకున్నాడు. ఇంతలోనే భర్త తల్లి మృతి చెందినట్టు వార్త రావడంతో.. అతడు సెప్టెంబర్‌ 29న భార్యా పిల్లలను అక్కడే ఉంచి.. హైదరాబాద్‌కు వచ్చాడు. సెప్టెంబర్‌ 30న పిల్లలు పార్కులో ఆడుకుంటుండగా.. ఇప్పుడే వస్తానంటూ పిల్లలతో చెప్పిన ఆమె ఇండియాకు వచ్చేసింది. గంటలు గడుస్తున్నా.. తల్లి ఇంటికి తిరిగి రాలేదు. అమ్మ కనిపించడం లేదంటూ.. ఇండియాలో ఉన్న తండ్రికి పిల్లలు ఫోన్‌ చేసి చెప్పారు. వెంటనే ఇండియా నుంచి లండన్‌కు వెళ్లిన భర్త.. భార్య గురించి ఆరా తీయడంతో ఆమె అక్టోబర్‌ 3న శంషాబాద్‌లోని మధురానగర్‌లో ఉన్నట్లు గుర్తించాడు. ఆమెతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఒకసారి ఆమె ఫోన్‌ కనెక్ట్‌ అయ్యింది. ఆమె మాట్లాడుతూ.. ఎవరో తనను కిడ్నాప్‌ చేశారంటూ చెబుతూ.. ఫోన్‌ కట్‌ చేసింది. వెంటనే అతడు.. తన భార్యను ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ ఈ మెయిల్‌ ద్వారా సైబరాబాద్‌ పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో శంషాబాద్‌ ఆర్‌జీఐ ఠాణాలో కేసు నమోదు చేసి.. రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ జోన్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు.

తనను కాపాడాలంటూ మెసేజ్‌..

తనను ట్యాక్సీ డ్రైవర్‌ ట్రాప్‌ చేసి గోవాకు తీసుకొచ్చాడని, తనను కాపాడి తన భర్త వద్దకు చేర్చాలంటూ హైదరాబాద్‌లో ఉన్న ఆమె భర్త స్నేహితులతో మాట్లాడి లైవ్‌ లోకేషన్‌ షేర్‌ చేసింది. ఈ ఫోన్‌ నంబర్‌ను వారు సైబరాబాద్‌ పోలీసులకు పంపించారు. సోమవారం ఉదయం ఆమనగల్‌ ప్రాంతంలో ట్యాక్సీ డ్రైవర్‌తో కలిసి ఆమె బస్సులో వస్తుండగా శంషాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి ఇద్దరిని విచారించారు.

ట్యాక్సీ డ్రైవర్‌ ట్రాప్‌ చేశాడు..

తాను అల్వాల్‌లో ఉన్న సమయంలోనే ట్యాక్సీ డ్రైవర్‌ ట్రాప్‌ చేశాడని తెలిపింది. అతడికి చెప్పకుండా లండన్‌కు వెళ్లానన్న కోపంతో ఉన్నాడని, నేను వెంటనే హైదరాబాద్‌కు రాకుంటే (తన అత్త మృతి చెందడంతో అల్వాల్‌కు వచ్చిన భర్తను) తన భర్తను చంపేస్తానంటూ బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌ చేశాడని పోలీసులతో చెప్పింది. తనను తన భర్త వద్దకు పంపించాలంటూ పోలీసులను కోరింది. ఆమెను సోమవారం రాత్రి లండన్‌కు పంపించారు. ఆ తరువాత ట్యాక్సీ డ్రైవర్‌ను పోలీసులు విచారించారు. ‘ఈ నెల 5న నా పుట్టిన రోజు.. ఆమెను ఇక్కడికి రమ్మంటే వచ్చింది.. తాను బ్లాక్‌ మెయిలింగ్‌, కిడ్నాప్‌ చేయలేదు’.. అంటూ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. దీంతో ఇదంతా ప్రేమాయణంలో భాగంగానే జరిగినట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి.. ట్యాక్సీ డ్రైవర్‌ను కూడా విడిచిపెట్టినట్టు తెలిసింది.

Tags

Next Story