కేంద్రం ప్రకటనతో కార్మికుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం

కేంద్రం ప్రకటనతో కార్మికుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
స్టీల్‌ప్లాంట్‌ పరిపాలన భవనానికి సమీపంలో కార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగాయి.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో... ఏపీలో ఆందోళనలు ఉదృతమయ్యాయి. ఉద్యోగులు, కార్మిక సంఘాలు, విపక్షాలు భగ్గుమంటున్నాయి. గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులు.... కేంద్రం ప్రకటనతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌కులోకి ఎవ్వరిని వెళ్లకుండా అడ్డుకున్నారు. అమరవీరుల స్థూపం వద్ద ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాలాజీని, ఫైనాన్స్ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ను అడ్డుకున్నారు. రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. టైర్ల గాలి తీసి.. నేమ్‌ ప్లేట్లు తొలగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. డెరెక్టర్లను అక్కడి నుంచి కదలనిచ్చేది లేదని కార్మికులు భీష్మించడంతో.. CISF బలగాలు రంగంలోకి దిగాయి. చివరికి కార్మికుల నిర్బంధంలో ఉన్న డైరెక్టర్లకు 6 గంటల తర్వాత విముక్తి కలిగింది. పోలీసులు వలయంగా ఏర్పిడంది.. డైరక్టర్లను అక్కడినుంచి తరలించారు.

స్టీల్‌ప్లాంట్‌ పరిపాలన భవనానికి సమీపంలో కార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగాయి. కేంద్ర ప్రకటనను నిరసిస్తూ వడ్లమూడి జంక్షన్‌లో పెద్దయెత్తున నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు. జాతీయ రహదారిపై బైఠాయించడంతో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ పోస్టర్లు తగలబెట్టారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కర్త, కర్మ, క్రియ జగనేనని విమర్శించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. స్టీల్‌ప్లాంట్‌ కోసం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసిన చోట.. టీడీపీ పోటీ చేయబోదని అన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికే విశాఖలో విజయసాయిరెడ్డి వీధిపోరాటాలు చేశారంటూ విమర్శించారు.

స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిన తరువాతే కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చిందన్నారు టీడీపీ నేత సబ్బం హరి. మోదీకి భయపడే జగన్‌ ఈ ఒప్పందానికి ఒప్పుకున్నారని ఆరోపించారు.

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ వంద శాతం అయిపోయిందన్నారు గంటా శ్రీనివాసరావు. ప్రైవేటీకరణపై కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తోందని, వైసీపీ, బీజేపీ నేతలు మాత్రం మొదటి నుంచి తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారాయన.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా.. ఉద్యమం కొనసాగుతోంది. కేంద్రం తన ప్రకటనను వెనక్కి తీసుకునేవరకు పోరాటం ఆగదంటున్నారు కార్మికులు, నిర్వాసితులు. తక్షణమే జగన్‌ సర్కారు... ప్రైవేటీకరణను ఆపాలంటూ డిమాండ్‌ చేశారు. లేకపోతో ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.

Tags

Next Story