పోస్కోతో ఒప్పందంపై తొలిసారి ప్రస్తావించిన విశాఖ స్టీల్‌

పోస్కోతో ఒప్పందంపై తొలిసారి ప్రస్తావించిన విశాఖ స్టీల్‌
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

విశాఖ స్టీల్‌ప్లాంట్, పోస్కో మధ్య ఒప్పందం నిజమేనని తేలింది. స్టీల్‌ప్లాంట్ జీఎం అధికారికంగా ఇచ్చిన లేఖలో డేట్‌తో సహా ఉంది. 2019లోనే పోస్కోతో ఒప్పందం జరిగినట్టు చాలా స్పష్టంగా ఉంది. కాని, అలాంటి ఒప్పందాలేం జరగలేదంటూ జగన్ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. వాస్తవానికి ఒప్పందం జరిగిన తరువాత పోస్కో ప్రతినిధులు జగన్‌తో భేటీ కూడా అయ్యారని టీడీపీ ఆరోపిస్తోంది. పోస్కోతో జరిగిన ఒప్పందాన్ని స్టీల్‌ప్లాంట్‌ జీఎం బయటపెట్టడంతో.. దీనికేం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తోంది ప్రతిపక్షం.

అక్టోబర్‌ 23.. 2019లో పోస్కోతో ఎంఓయూ కుదిరినట్లు లేబర్‌ కమిషనర్‌కు ఇచ్చిన లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించింది విశాఖ స్టీల్స్. విశాఖ స్టీల్‌ GM .. పోస్కోతో జరిగిన ఒప్పందాన్ని తేదీతో సహా అందులో ప్రస్తావించారు. ఇప్పటివరకు జగన్‌ సర్కారు.. పోస్కోతో ఎలాంటి ఒప్పందం జరగలేదంటూ బుకాయిస్తోంది. ఈ లేఖతో జగన్‌ సర్కారు చెప్పేదంతా అబద్దమని తేలిపోయిందంటున్నారు కార్మిక సంఘాలు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు.. ఈ నెల 27న సమ్మె చేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని లేబర్‌ కమిషనర్‌కు తెలిపారు కార్మిక నేతలు. లేబర్‌ కమిషనర్‌తో జరిగిన చర్చల్లో.. విశాఖ స్టీల్స్‌ GM (HR) సైతం పాల్గొన్నారు. సమ్మె వల్ల ఉత్పత్తి పడిపోతుందని, దీని వల్ల కంపెనీ తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. అయితే.. ప్రైవేటీకరణ వల్ల మరింత తీవ్రంగా నష్టపోతామని కార్మికులు స్పష్టంగా చెప్పారు. ఈ సందర్భంగా కంపెనీ జీఎం... లేబర్‌ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. ఈ లేఖలో పోస్కోతో ఒప్పందం జరిగినట్లు స్పష్టంగా ప్రస్తావించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story