విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాగరతీరంలో ఉద్యమ నినాదాలు

విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు అంటూ సాగరతీరంలో ఉద్యమ నినాదాలు హోరెత్తుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనతో విశాఖలో ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. కూర్మన్నపాలెం స్తూపం ఎదుట నెల రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు... ఉద్యమం కొనసాగుతుందని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. విశాఖలో నిర్వాసితుల నిరాహారదీక్షకు విపక్షాలు, విద్యార్థి, ప్రజాసంఘాల మద్దతు పెరుగుతోంది. ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నెల రోజులుగా ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ప్రత్యేక కార్యాచరణతో సిద్ధమైంది. ఇవాళ, రేపు పార్లమెంట్ సభ్యులకు కార్మిక సంఘాల నేతలకు వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. మార్చి 15న రైల్వే స్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టనున్నారు. ఉక్కు ఉద్యమానికి మద్దతుగా మార్చి 15, 16న బ్యాంకు ఉద్యోగుల విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. మార్చి 17న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులు, మార్చి 18న సమ్మె చేయనున్నారు. కూర్మన్నపాలెం స్తూపం ఎదుట కార్మికులు, నిర్వాసితులు చేస్తున్న రిలే దీక్షలు 30వ రోజుకు చేరాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com