ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా..? : కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా..? :  కేటీఆర్
విశాఖ ఉక్కుపై మాట్లాడితే.. ఏపీతో మీకేం పని అని అంటున్నారని.. ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా అని కేటీఆర్ నిలదీశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో కార్మికులకు మద్దతు ఇస్తూ తాము కూడా ఉద్యమంలో పాల్గొంటామని మంత్రి కేటీఆర్ ప్రకటించడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్‌కు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. ఎన్నికలప్పుడే కేటీఆర్‌కు పూనకం వస్తుందంటూ ఆరోపించారు. గత ఏడేళ్లుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల వద్ద వ్యతిరేకతను తగ్గించుకోవడానికి బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

మరోవైపు కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణపై మోదీ సర్కారు వివక్షను చూపిస్తోందని ఆయన ఆరోపించారు. బిజెపి జాతీయవాదంలో తెలంగాణ ప్రయోజనాలు లేవా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుపై మాట్లాడితే.. ఏపీతో మీకేం పని అని అంటున్నారని.. ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా అని నిలదీశారు. ఇవాళ స్టీల్‌ప్లాంట్, రేపు సింగరేణి, ఆ తర్వాత బీహెచ్ఈల్ పరిశ్రమలను మోదీ సర్కారు అమ్మేస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏపీ విషయంలో నోరు మూసుకొని కూర్చోబోమని.. రేపు తెలంగాణకు కష్టం వస్తే మా వెంట ఎవరుంటారని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.

ఇక బీజేపీ నాయకురాలు విజయశాంతి సైతం సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ ప్రకటనపై స్పందించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కుటుంబం ఇచ్చిన హామీలు ప్రజలందరికీ తెలుసన్నారు. ఓట్ల కోసమే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు పలుకుతున్నారని విజయశాంతి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ వంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపిస్తామని.. ఉద్యోగాలు ఇస్తామని టీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం మాట మాత్రమైనా వాటి ప్రస్తావన చేయడం లేదని తీవ్ర విమర్శలు చేశారు విజయశాంతి. మొత్తానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్ పై అటు ఏపీలోనే కాకుండా.. ఇటు తెలంగాణలోనూ నేతల మధ్య వార్ నడుస్తోంది.



Tags

Read MoreRead Less
Next Story