WAR TENSIONS: భయం గుప్పిట్లో టాలీవుడ్ సెలెబ్రెటీలు

పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలతో సామాన్యులతో సెలబ్రెటీలు భయాందోళనకు గురవుతున్నారు. హాలిడే ఎంజాయ్ చేయటానికి, విమానం మారటానికి వెళ్లిన దుబాయ్ ఎయిర్ పోర్టులో దిగిన వారు అక్కడే ఇరుక్కుపోయారు. గగనతలం మూసివేయటం, విమానాలు రద్దుతో వారి వచ్చేందుకు మార్గం కనిపించటం లేదు. క్షిపణులు, డ్రోన్ దాడులతో భయాందోళనకు గురవుతున్నామని.. అక్కడ జరుగుతున్న భయంకర అనుభవాలను పంచుకుంటున్నారు. ఎలాగైనా తమను ఇక్కడి నుంచి సురక్షితంగా తీసుకువెళ్లాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
షాకింగ్ పోస్ట్ పెట్టిన శ్రీజ
మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ దుబాయ్‌లో క్షేమంగా ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలిపారు. 'మా క్షేమం కోరి ఫోన్లు, మెసేజ్‌లు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ మాకు ఎంతో ఊరటనిచ్చింది. ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. త్వరలోనే శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాను' అని ఆమె రాసుకొచ్చారు. తాము ఈ దేశాన్ని ఎంచుకున్నాము, మేము దీనికే కట్టుబడి ఉంటాము అనటంతో శ్రీజ తన పిల్లలతో కలిసి శాశ్వతంగా దుబాయ్‌లో స్థిరపడినట్లు తెలుస్తోంది.
"దేవుడు రక్షిస్తాడని నమ్ముతున్నా"
నటి ఈషా గుప్తా ప్రస్తుతం అబుదాబిలో ఉన్నారు. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె తన క్షేమ సమాచారాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నారు. తన గురించి ఆరా తీస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపి.. మేమంతా క్షేమంగా ఉన్నామని చెప్పారు. పరిస్థితులు భయానకంగా ఉన్నాయని.. దేవుడు రక్షిస్తాడని నమ్ముతున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. యూఏఈ ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం అద్భుతంగా పని చేస్తోందని పేర్కొన్నారు.
"మోదీజీ రక్షించండి"
దుబాయ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకున్న తనను సురక్షితంగా ఇండియాకు చేర్చేందుకు సాయం అందించాలని హీరోయిన్ సోనల్ చౌహన్ ప్రధాని మోదీని కోరారు. విమాన రాకపోకల అంతరాయంతో ఇండియాకు ఎలా చేరుకోవాలో తెలియడం లేదంటూ నమస్కరిస్తున్న ఎమోజీని జత చేశారు. ఈమె 'లెజెండ్','డిక్టేటర్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో' సినిమాల్లో నటించారు.
మంచు విష్ణు ఫ్యామిలీకి తప్పిన ప్రమాదం
హాలిడే ట్రిప్‌కు వెళ్లిన మంచు విష్ణు కుటుంబ సభ్యులకు భయంకరమైన ట్రిప్ అయ్యింది. 'క్షిపణుల శబ్దాలకు తాము ఉంటున్న ఇళ్లు కంపించిందన్నారు. తన కూతురు ఐరా భయపడిపోయిందన్నారు. యుద్ధం లేని ప్రపంచం కోసం, శాంతి కోసం ప్రార్థిస్తున్నానన్నారు. గాలిలోనే అడ్డుకుంటున్న భారీ శబ్దాలు వారిని భయాందోళనకు గురిచేశాయని.. ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దాల మధ్య పెరగకూడదని అన్నారు. ఈ క్రమంలో గగనతలంలో క్షిపణులు వెళ్తున్న వీడియోను షేర్ చేశారు.
ఈ క్రమంలో మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ చేశారు. "ఈ కష్టకాలంలో విష్ణు, అతని కుటుంబం దుబాయ్‌లో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. మన సొంత మనుషులు ప్రమాదంలో ఉన్నప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. మీరందరూ నా హృదయానికి ఎంతో దగ్గరైన వారు. దేవుని కృప మిమ్మల్ని కాపాడాలి. చివరికి ప్రేమే గెలవాలి' అని రాసుకొచ్చారు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు. ఆమె దుబాయ్‌లో నివసిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం తాను ఇండియాలోనే ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణలు, అక్కడి భయంకరమైన దృశ్యాలు తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ప్రజలు రేపు ఏం జరుగుతుందో అనే భయంతో బతుకుతున్నారు. అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే చాలా బాధగా ఉందని.. త్వరలో పరిస్థితులు అదుపులోకి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
