రాయలసీమకు నీటి కష్టాలు

రాయలసీమకు నీటి కష్టాలు తప్పేలా లేవు. ఆ ప్రాంత ప్రయోజనాలు.. అక్కడి రైతుల శ్రేయస్సే ముఖ్యమని చెప్పిన సర్కారు మాటలు ఉత్తదే అని తేలిపోయింది. రాష్ట్ర సాగునీటి ప్రయోజనాల కోసం కేంద్రంతో జగన్ ప్రభుత్వం రాజకీయంగా పోరాడి ఉంటే రైతులకు నీటి కష్టాలు తప్పేవి. ఆగస్టు రెండోవారం వచ్చినా ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేని పరిస్థితి. దీంతో శ్రీశైలం నీళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
కర్నూలు- కడప కాలువ, SRBC కింద అక్కడక్కడ రైతులు పంటలు వేశారు. హంద్రీనీవా జలాశయం నీళ్లపై ఆశతో అనంతపురం జిల్లా ఉరవకొండ తదితర ప్రాంతాల్లోనూ మిరప పంటసాగు చేసి అది ఎండిపోయే దశలో ఉండటంతో కంటతడిపెడుతున్నారు. శ్రీశైలం జలాల కోసం రైతులు పట్టుబడుతున్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు వదిలేందుకు అవసరమైన 854 అడుగుల నీటిమట్టం కూడా దాటింది. ప్రస్తుతం వర్షాలు లేనందున ఒకటి రెండు తడులు అందకపోతే ఎలా అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. నంద్యాల సాగునీటి సలహామండలి సమావేశంలో జల వనరులశాఖ అధికారులు నీటి విడుదలకు ప్రతిపాదనలు చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రులు ఎలాంటి నిర్ణయాలూ తీసుకోకుండా ప్రభుత్వానికే నివేదించాలని సూచించారు.
హంద్రీనీవా సుజల స్రవంతి పథకం పరిధిలో వరద నీటి లభ్యతను బట్టి ఈ ఖరీఫ్‌లో సాగునీటిని అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 43,304 ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రాయలసీమ జిల్లాల్లో 40 టీఎంసీల నీళ్లు తాగు, సాగుకు ఇవ్వాలని ప్రతిపాదించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో పొరుగు రాష్ట్రం తన వాటాకు మించి నీళ్లు వాడుకుంటోందని ప్రభుత్వం ఆరోపిస్తుంది. శ్రీశైలంలో వేసవి నాటికే నీటిమట్టాలు పడిపోవడానికి పక్క రాష్ట్రం నిబంధనలకు విరుద్ధంగా నీళ్లు వాడుకోవడమే కారణమని చెబుతోంది. రాష్ట్ర సాగునీటి ప్రయోజనాల కోసం కేంద్రంతో జగన్ ప్రభుత్వం రాజకీయంగా పోరాడి ఉంటే నేడు రాయలసీమకు నీళ్లు అందించే పరిస్థితి ఉండేది కదా అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com