విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నారు?

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నారు?
Pawan Kalyan : పవన్ కల్యాణ్... ఈ మధ్య పార్టీ కార్యక్రమాల స్పీడు పెంచినట్లే కనిపించారు. విశాఖ వెళ్లి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

Pawan Kalyan : పవన్ కల్యాణ్... ఈ మధ్య పార్టీ కార్యక్రమాల స్పీడు పెంచినట్లే కనిపించారు. విశాఖ వెళ్లి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తామంటే... రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఆవేశంగా ఊగిపోయారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని నడిపించడానికి కావల్సిన యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలన్నారు. ఇందుకోసం వైసీపీ సర్కారుకు వారం రోజుల గడువు పెట్టారు. అల్టీమేటం జారీ చేసి వారం దాటింది. అయినాసరే జగన్ సర్కారు నుంచి ఉలుకూపలుకూ లేదు.

మధ్యలో మంత్రి కొడాలి నాని తెరపైకి వచ్చి... కేంద్ర ప్రభుత్వంతోనే తేల్చుకోండి మాకేంటి సంబంధం అని చెప్పి వెళ్లిపోయారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా క్షేత్రస్థాయి పోరాటలకు దిగిన పవన్... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతివ్వడంతో ఉద్యమం ఊపందుకుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ మరోసారి పవన్ సైలెంట్ అయ్యారు. అల్టిమేటంకు స్పందించకపోతే... యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తామంటూ ప్రకటించిన పవన్ ఇప్పటిదాకా నోరు విప్పకపోవడంపై జనసేన కార్యకర్తల్లోనూ గందరగోళం నెలకొంది.

ఉక్కు ఉద్యమాన్ని జగన్ సర్కారు పట్టించుకోవడం లేదు. దాన్ని భుజాలకెత్తుకుని ముందుండి నడిపిస్తాడనుకున్న పవన్ ఆ ఊసే ఎత్తడం లేదు. కేంద్రంలో బీజేపీతో దోస్తీ కట్టిన పవన్... రాష్ట్రంలో దాని విధానాలను వ్యతిరేకిస్తూ ఉక్కు ఉద్యమానికి మద్దతిచ్చారు. పవన్ తీరును చూసి... కేంద్రంలో బీజేపీకి గుడ్‌బై చెప్పేస్తారనే చర్చ కూడా నడిచింది. బద్వేలు ఉప ఎన్నికలో పోటీచేయబోమని పవన్ ప్రకటించడంతో బీజేపీకి కటీఫ్ చెప్పేస్తారనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో పవన్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? చెప్పాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

పవన్ కల్యాణ్ ఎంత ఆవేశంతో ఊగిపోతారా... అంత వేగంగా మాయమైపోతారనే విమర్శలున్నాయి. ఏపీలో పాడైన రోడ్లపై ఆమధ్య సోషల్ మీడియా ఉద్యమం చేపట్టి పీక్‌కు తీసుకెళ్లారు. పాడైన రోడ్ల ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటూ ట్విట్టర్‌లో వార్ మొదలు పెట్టారు. దీనికి జనసేన శ్రేణుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఏపీ వ్యాప్తంగా వేలాదిమంది రోడ్ల తీరును ఎండగట్టడంతో ప్రభుత్వంలోనూ వణుకుపుట్టింది. అప్పుడు కూడా పవన్... వైసీపీ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. స్వయంగా పర్యటన చేపట్టి అనంతపురం జిల్లాలోని కొత్తచెరువుకు, ఈస్ట్ గోదావరి జిల్లాకు వెళ్లాడి హడావుడి చేశారు. ఆ తర్వాత దాని ఊసేలేదు. అంతా సైలెంట్ అయ్యారు. రోడ్లు బాగుపడ్డాయా అంటే అదీ లేదు. పోనీ ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తారా అంటే ఉలుకూపలుకూ లేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినా... ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. అయితే అమరావతికి వెళ్లి రైతులకు సంఘీభావం ప్రకటించిన పవన్... వాళ్లతో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా ఎలాంటి యాక్షన్ లేదు. పవన్ వాస్తాడు మద్దతిస్తాడని వేచి చూసిన అమరావతి రైతులకు నిరాశే మిగిలింది. ఎంతో ఆవేశంగా వచ్చే పవన్... అంతే వేగంగా ఎందుకు మాయమవుతారో అర్థం కావడం లేదనే చర్చ మొదలైంది. అటు విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మిక సంఘాలు, కార్మికులదీ అదే పరిస్థితి. అఖిలపక్షం ఏర్పాటు చేసి యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలంటూ వైసీపీ సర్కారుకు పవన్ అల్టిమేటం జారీ చేయడంతో... జనసేనాని తమకు అండగా నిలుస్తాడని ఆశపడ్డారు. మరి ఇప్పుడు వాళ్ల ఆశలు అడియాశలేనా? లేక పవన్ తన మాట నిలబెట్టుకుంటారా అనే చర్చ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story