Andhra Pradesh: ఏపీలో క్రూర మృగాల సంచారం.. అడవిని వదిలి పల్లెల్లోకి..

Andhra Pradesh: ఏపీలో క్రూర మృగాల సంచారం వణుకు పుట్టిస్తోంది. రోజూ ఏదో ఒక ప్రాంతాల్లో ఇవి కనిపిస్తుండంతో ఆందోళన చెందుతున్నారు జనం. నెల రోజులుగా కాకినాడ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్దపులి ఘటనను మరవకముందే.. తాజాగా అల్లూరి, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. అల్లూరి జిల్లాలో ప్రజల్ని పెద్దపులి హడలెత్తిస్తోంది.
అనంతగిరి మండలం చిలకలగెడ్డలో పెద్దపులి సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ గేదెపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులు చిలకలగెడ్డ దగ్గరకు చేరుకున్నారు. పెద్దపులి కోసం గాలింపు ముమ్మరం చేశారు. పెద్దపులి సంచారంతో బిక్కుబిక్కుమంటున్నామని, పొలాలకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
అటు.. విజయనగరం జిల్లాలోనూ పెద్దపులి సంచారం ఆందోళనకు గురి చేస్తుంది.శృంగవరపు కోట మండలం బొడ్డవర, ఐతన్నపాలెం గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. పులి దాడిలో ఒక ఆవు మృతి చెందగా.. మరో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు.
విశాఖ - విజయనగరం జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో.. తమ సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలిపారు అటవీశాఖ రేంజ్ అధికారులు బొత్స అప్పలరాజు. పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించామని, పగ్ మార్క్స్ సేకరించామన్నారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
కొద్దిరోజులుగా కాకినాడ జిల్లాలో జనాన్ని హడలెత్తింది పెద్దపులి. బోనులో చిక్కకుండా అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ తర్వాతా అది తూర్పు మన్యం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దపులిని బోనులో బంధించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రత్తిపాడు మండలంలోని గ్రామాల నుంచి ఏలేరు తీరం వరకు 10 కిలోమీటర్ల మేర పులి కలియతిరిగింది.
మొన్నటిదాకా కాకినాడ సమీపంలో సంచరించిన పులి ఇప్పుడు విజయనగరం జిల్లాలో సంచరిస్తున్న పులి ఒకటేననే అనుమానం వ్యక్తమవుతోంది. కాకినాడ నుంచి విజయనగరం దాకా వచ్చిందా లేక ఈ పులి వేరేనా అనేది తెలియాల్సి ఉంది. కాకినాడ అటవీ ప్రాంతంలో బోను దాకా వచ్చి బోనులో చిక్కకుండా తప్పించుకున్న పులి జాడ కూడా ఇప్పటికి తెలియలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com