Kadapa: కోచ్ ముసుగులో కీచకుడు.. మహిళా క్రికెటర్లకు వేధింపులు..

Kadapa: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో లైంగిక వేధింపుల ఘటన మరోసారి బయటపడింది. కోచ్ ముసుగు వేసుకున్న ఓ కీచకుడు మహిళా క్రికెటర్లను దారుణంగా వేధిస్తున్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు అనుబంధంగా ఉన్న ప్రొద్దుటూరు సబ్‌సెంటర్‌లో ఓ కోచ్ ప్రవర్తన అసోసియేషన్‌కే తలవంపులు తెస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొందరు అమ్మాయిల్ని కోచ్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బాధితురాలు మహిళా కోచ్‌కు చెప్పుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రొద్దుటూరు సబ్ సెంటర్‌లో అరాచకంపై ఆ లేడీ కోచ్.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు, డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. పది రోజులు దాటినా ఇంత వరకూ దీనిపై విచారణ లేదు. చర్యలూ లేవు.
అసోసియేషన్ పెద్దలు ఈ విషయంపై స్పందించకపోవడంతో బాధిత అమ్మాయిలు టీవీ5ని ఆశ్రయించారు. తాము ఎదుర్కొంటున్న టార్చర్‌ను వివరించి కన్నీరు పెట్టుకున్నారు. లైంగిక వేధింపుల ఘటనపై మహిళా కోచ్‌ను కలిసి మాట్లాడితే అదంతా నిజమేనని చెప్పుకొచ్చారు. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే పైవాళ్లకు నివేదించానని, ఇప్పటి వరకూ చర్యల్లేవని అన్నారు.
ఎన్నో ఆశలతో ఆటలో రాణించాలనే పట్టుదలతో ట్రైనింగ్ కోసం వస్తే ఇక్కడ కోచ్ రూపంలోనే కీచకులు మాటువేసి ఉండడం.. అసోసియేషన్ పెద్దలు దీన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మహిళల్ని ప్రోత్సహించడం, వారికి భరోకా కల్పించడంలో ఎందుకింత వైఫల్యం అనే ప్రశ్నలూ వస్తున్నాయ్. ఇప్పటికైనా ACA యాక్షన్‌లోకి దిగి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కచ్చితంగా కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com