VIVEKA: వివేకా రక్తంపైనే వైసీపీ పునాదులు
తండ్రిపోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు, చంపినవాళ్లు, చంపించినవాళ్లు, వాళ్లను కాపాడుతున్నవాళ్లు మరోవైపు ఉన్నారని వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హత్యచేసింది బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నా... ఐదేళ్లుగా వారికి శిక్షపడలేదని వాపోయారు. అండగా ఉండాల్సిన అన్నే హంతకులకు కొమ్ముకాస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను సూటిగా విమర్శించారు. తన తండ్రిని చంపినవారికి వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధిచెప్పాలని వివేకా కుమార్తె సునీత ప్రజలకు పిలుపునిచ్చారు. వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో జరిగిన జ్ఞాపకార్థ సభలో కుటుంబ సభ్యులతో పాటు పలు పార్టీల నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు. వివేకాను చంపిన వాళ్లను వదిలేసి తమపైనే నిందలు వేయడం.. ఎంత వరకు సమంజసమని జగన్‌ను ప్రశ్నించారు. మా అన్న పార్టీకి ఓటు వేయవద్దన్న సునీత... అన్నం పెట్టిన చేతిని నరకడం, ఆయన వ్యక్తిత్వం మీద బురద జల్లడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ పునాదులు వివేకా రక్తంపై ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లుగా వివేకానందరెడ్డికి న్యాయం జరగలేదనే ఆవేదన తనలో ఉందని వైఎస్ షర్మిల అన్నారు. జగన్ ఇంతగా దిగజారిపోతారని అనుకోలేదన్న ఆమె... అద్దం ముందు నిల్చొని తన మనస్సాక్షిని తాను ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. వివేకా మరణంతో బాధితులైన తన చిన్నమ్మ, సునీతకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా... వారిపైనే తప్పుడు ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. సునీత కుటుంబానికి సంఘీభావం తెలిపిన వివిధ పార్టీలు ఆమె న్యాయపోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జ్ఞాపకార్థ సభకు హాజరైన పలువురు స్థానిక నేతలు వివేకా చిత్రపటానికి నివాళులర్పించారు.
పదేపదే మాపై ఆరోపణలు చేయడానికి మీకు సిగ్గుగా లేదా? సాక్షి పత్రికలో మాపై నిందలు వేస్తూ వార్తలు రాస్తున్నారు. సాక్షి ఛైర్‌పర్సన్ భారతికి ఓ విన్నపం.. మీ వద్ద ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండి. ఆధారాలు ఉండీ పోలీసులకు ఇవ్వకపోవడం నేరం. అన్నం పెట్టిన చేతిని నరకడం.. వ్యక్తిత్వం మీద బురద జల్లడం దారుణం. మాపై నిందలు వేసినా.. సీతాదేవిలా నిర్దోషిత్వం నిరూపించుకుంటాం. మీ కోసం నిరంతరం పని చేసిన వివేకాను మర్చిపోయారా? తండ్రిపోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు ఉన్నారు.. చంపినవాళ్లు, చంపించినవాళ్లు, వాళ్లను కాపాడుతున్న వాళ్లు మరోవైపు ఉన్నారు. ప్రజలారా.. మీరు ఎటువైపు ఉంటారు? దిగ్భ్రాంతిలో ఉండిపోతారా? మీకు స్పందించే అవకాశం వచ్చింది.. స్పందించండి. వైకాపా పునాదులు వివేకా, కోడికత్తి శ్రీను రక్తంలో మునిగి ఉన్నాయి. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీ భవిష్యత్ కోసం బయటకు రండి. రాకపోతే ఆ పాపం మీకు చుట్టుకుంటుంది’’ అని సునీత వ్యాఖ్యానించారు.VIVEKA: వివేకా రక్తంపైనే వైసీపీ పునాదులు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com