Andhra Pradesh: వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై

గన్నవరం రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు ముందు అధికార వైసీపీ బిగ్‌షాక్ తగిలింది. కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. అపాయింట్‌మెంట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ముఖ్య అనుచరులతో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడిన యార్లగడ్డ వెంకట్రావు.. వైసీపీపై నిప్పులు చెరిగారు. పార్టీలో తనకు జరిగనన్ని అవమానాలు మరే నేతకు జరగలేదన్నారు. అయినా పార్టీ కోసం అన్నీ భరించానని చెప్పారు. మూడున్నరేళ్లుగా వైసీపీ అధిష్ఠానం తనకు ప్రత్యామ్నాయం చూపలేకపోయిందని ఫైర్ అయ్యారు.
తనను దేశం మెచ్చింది కానీ వైసీపీ మెచ్చలేదన్నారు యార్లగడ్డ. పదవి లేకపోతే పది మంది కూడా వెంట ఉండరన్నారు. పదవి లేకపోయినా.. అసలైన కార్యకర్తలు తన వెంటే ఉన్నారని చెప్పారు. పొమ్మంటే పోవడం లేదని కొందరు నేతలు అంటుంటే బాధేసిందన్నారు. వైఎస్సార్ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదన్న యార్లగడ్డ... ఏ పార్టీ అయినా నమ్మినవారిని కాపాడుకోవాల్సి అవసరం ఉందన్నారు.
సజ్జల వ్యాఖ్యలపై యార్లగడ్డ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. KDCC బ్యాంక్‌ను అభివృద్ది చేసినా పనికి రానని పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కంచుకోట గన్నవరంలో వైసీపీ బలోపేతానికి ఎంతో పనిచేశానని చెప్పారు. గన్నవరం అభ్యర్ధిగా తాను సరిపోనని అన్నారు.. పార్టీకి ఇంత పని చేస్తే నాకు ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చశారు. 2019లో సరిపోయిన నా బలం.. ఇప్పుడెందుకు సరిపోదో వాళ్లే చెప్పాలన్నారు. తడి గుడ్డతో గొంతు కోశారని యార్లగడ్డ వాపోయారు. టీడీపీ నుంచి గెలిచి వచ్చిన వారు రావడమేనా వైసీపీ బలం అని ప్రశ్నించారు. తాను ఇప్పటివరకు చంద్రబాబు, లోకేష్‌ను కలవలేదన్నారు యార్లగడ్డ వెంకట్రావు. తనపై వైసిపి నేతలే దుష్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్ వెళ్లి కలుస్తా.. టీడీపీలో చేరుతానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయడం ఖాయం... అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమన్నారు యార్లగడ్డ వెంకట్రావు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com