JAGAN: అయినా... జగన్ మారలేదు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ అనుసరించిన వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తోటి శాసనసభ్యులకు జగన్ ఏ మాత్రం గౌరవం ఇవ్వకపోవడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన సభ్యుల ప్రమాణ స్వీకారం ముగియక ముందే.. ఎమ్మెల్యేగా తాను మాత్రం ప్రమాణం చేసేసుకుని జగన్ సభ నుంచి వెళ్లిపోయారు. సభలో జగన్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆలస్యంగా శాసనసభకు వచ్చిన జగన్.. కొద్దిసేపు వెనుక వరుసలో అప్పటికే ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కూర్చుకున్నారు. తన పేరును ప్రమాణ స్వీకారం కోసం పిలువగానే వేదిక వద్దకు వెళ్లి ప్రమాణం చేశారు. తన ప్రమాణం ముగిశాక బయటకు వెళ్లిపోయారు. కాసేపు గతంలో డిప్యూటీ స్పీకర్‌కు కేటాయించిన చాంబర్లో కూర్చుని నిష్క్రమించారు. శాసనసభ సంప్రదాయాల మేరకు సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయి.. ప్రొటెం స్పీకర్ సభను వాయిదావేసేవరకు సభ్యులందరూ సభలోనే ఉంటారు. ఈ మర్యాదను జగన్ పాటించలేదు. కనీసం వైసీపీ సభ్యుల ప్రమాణాలైనా ముగియక ముందే.. సభ నుంచి వెళ్లిపోవడాన్ని సీనియర్ సభ్యులు తప్పుబట్టారు. సభ్యుడిగా ప్రమాణం చేశాక జగన్ పవన్ కల్యాణ్, చంద్రబాబుకు నమస్కారం చేస్తూ ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్దకు వెళ్లారు.
ఏపీ శాసనసభ స్పీకర్‌గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభకు రాకూడదని వైసీపీ నిర్ణయించింది. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించినట్టు తెలుస్తోంది. ఎన్నికైన సభాపతిని అధికార, విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఎప్పట్నుంచో వస్తున్న ఈ ఆనవాయితీకి జగన్ తిలోదకాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా జగన్ వ్యక్తిగత పర్యటన పెట్టుకున్నారు. ఇవాళ పులివెందుల వెళ్లనున్న జగన్ అక్కడే మూడు రోజుల పాటు ఉండనున్నారు.
దొడ్డిదారిలో జగన్
తాడేపల్లి నివాసం నుంచి అసెంబ్లీకి బయల్దేరిన జగన్ దొడ్డిదారిలో శాసనసభకు చేరుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి నేరుగా హైకోర్టుకు వెళ్లే దారిలోకి వెళ్లి.. దొడ్డిదోవన అసెంబ్లీ రోడ్డులోకి వచ్చారు. కరకట్ట మీదుగా మందడం గ్రామానికి వచ్చేందుకు ఆయన సాహసించలేదు. ఈ దారిలో వెళ్తే రాజధాని ప్రజల నుంచి అవమానాలు ఎదురవుతాయని భావించారో.. లేదంటే ముఖం చెల్లకేమో.. వెనుక దారిలో అసెంబ్లీకి వచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com