YCP: మంత్రి రజని ఆరున్నర కోట్లు లంచం తీసుకున్నారు
ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేటలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి రజినితో పాటు సజ్జలపై ప్రస్తుత ఇంఛార్జి మల్లెల రాజేష్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. టికెట్ కోసం రజిని ఆరున్నర కోట్ల లంచం తీసుకున్నారని బాంబు పేల్చారు. అయినా తనకు కాకుండా వేరేవారికి వైసీపీ టికెట్ ఇస్తున్నారన్న సమాచారంతో... రాజేష్ నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారు. తనకు కాకపోతే మర్రి రాజశేఖర్‌కు ఇవ్వాలన్న ఆయన... బయటి వారికి ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇన్‌ఛార్జ్‌ల మార్పుల్లో భాగంగా... రజినిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. ఆమె స్థానంలో మల్లెల రాజేష్ నాయుడుని మూడు నెలల క్రితం ఇంఛార్జిగా ప్రకటించారు. అక్కడ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నారు. చిలకలూరిపేటలో తాజా పరిస్థితుల ప్రకారం రాజేష్ నాయుడు సరిపోరని వైసీపీ అధిష్ఠానం భావించింది. నెలరోజులుగా కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పేరుని పరిశీలిస్తున్నారు. ఇటీవల రెండుసార్లు మనోహర్ నాయుడుని వైసీపీ అగ్రనాయకత్వం పిలిపించుకుని చిలకలూరిపేట టికెట్ విషయంపై మాట్లాడింది. ఆయన అభ్యర్థిత్వంపై జగన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ఈలోగా రాజేష్‌ని పిలిపించిన సజ్జల చిలకలూరిపేటకు వేరేవారిని ఇంఛార్జిగా నియమిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించిన రాజేష్‌కు ఈ పరిణామం మింగుడు పడలేదు. దీంతో చిలకలూరిపేటలోని వైసీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మంత్రి రజనికి ఆరున్నర కోట్లు లంచం ఇచ్చానని ఆ విషయం సజ్జలకు కూడా చెప్పానని తెలిపారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు సజ్జలని మారిస్తేనే పార్టీ బతుకుతుందని నినాదాలు చేశారు. జోక్యం చేసుకున్న రాజేష్... తనకి కాకపోతే స్థానిక నేత మర్రి రాజశేఖర్‌కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేరేవారిని తీసుకొస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజేష్ నాయుడు వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పిన కార్యకర్తలు... మీరే పోటీచేయాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. పక్కన ఉన్న వారు అతని నుంచి కిరోసిన్ బాటిల్ లాక్కున్నారు.
రాజేష్ నాయుడు విడదల రజిని ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. గుంటూరు పశ్చిమకు మార్చిన సమయంలో రజిని ముఖ్యమంత్రికి చెప్పి రాజేష్‌ను ఇంఛార్జిగా నియమించేలా చూశారు. ఈ క్రమంలోనే కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారినట్లు ప్రచారం జరిగింది. డబ్బుల విషయం బయటకు రావటంతో... రాజేష్ ఇందుకు కారణమని భావించిన రజిని ఆయన్ను దూరం పెట్టారు. ఇటీవల తనను కలిసిన చిలకలూరిపేట వైసీపీ నేతలతో 'మంచిరోజులు వస్తాయి.. కొంచెం ఓపిక పట్టాలని చెప్పారు. అప్పటి నుంచే రాజేష్‌ని మారుస్తారనే ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్లుగానే రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కొత్త ఇంఛార్జి విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. దీంతో రాజేష్ మర్రి రాజశేఖర్ పేరు తెరపైకి తెచ్చారు. రజినికి, మర్రికి పొసగదు. అందుకే రాజశేఖర్‌కు టికెట్ ఇస్తే పని చేస్తానని రాజేష్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com