Ap News : అందని విద్యా దీవెన, విద్యార్ధుల ఆగచాట్లు

Ap News : అందని విద్యా దీవెన, విద్యార్ధుల ఆగచాట్లు
వైసీపీ పాలనలో భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థ

ప్రతి సభలోనూ విద్యాదీవెన, వసతి దీవెనంటూ మాట్లాడే జగన్‌ చేతలు చూసి అయ్యో పేదల పెన్నిధి అనుకున్నారు అంతా. కానీ, తర్వాతే అర్థమైంది పెత్తందారులకు సన్నిహితుడు అని. 2019 ఎన్నికల ముందు ఎంత ఖర్చైనా పేద పిల్లలను చదివించే బాధ్యత తనదే అంటూ ఊదరగొట్టిన ఆయన...అధికారంలోకి వచ్చాక నిలువునా ముంచేశారు. ప్రభుత్వం నేరుగా కళాశాలలకు ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి.. తల్లుల ఖాతాలో వేసే విధానం ద్వారా SC, ST, BC మైనారిటీ, పేద తల్లులకు భారీగా అప్పులు మిగిల్చారు. ఆకలితో అలమటిస్తున్న వారికి అరకొర ముద్దపెట్టి...కడుపు నింపేశామన్నట్లు ప్రచారం చేసుకుంటూ వసతి దీవెనను గాలిలో కలిపేశారు. రెండు విడతలుగా ఇవ్వాల్సిన ఈ డబ్బులను గతేడాది ఒకసారే ఇవ్వగా...ఈసారి ఒక్క రూపాయీ లేదు. అయితే జగన్‌ మాత్రం ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికంలో ఇస్తున్నామంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.

సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నామని భుజాలు చరుచుకునే జగన్‌ మాటల్లోని డొల్లతనాన్ని అమ్మఒడి’పథకం బట్టబయలు చేసింది. 2019 ఎన్నికలకు ముందు ఇద్దరు పిల్లల్ని బడికి పంపితే ఒక్కొక్కరికి 15వేల చొప్పున ఇస్తామంటూ జగన్‌ సతీమణి భారతి ప్రచారం చేశారు. ప్రజలను నమ్మించారు. జగన్‌ సైతం 6నుంచి 10 తరగతుల్లో ఇద్దరికి ఏడాదికి 18వేలు, ఇంటర్మీడియట్‌లో ఇద్దరికి 24వేలు చొప్పున ఇస్తామంటూ హామీలు గుప్పించారు. గెలిచాక ఒక్కరికే ఇస్తామంటూ నాలుక మడతేశారు. ఒక్కో ఏడాది ఒక్కో నిబంధన తీసుకొస్తూ కోతలకు పదునుపెట్టారు. ఐదేళ్ల పాలనలో 75శాతం హాజరు నిబంధనతో నాలుగేళ్లు మాత్రమే పథకాన్ని అమలు చేసి..దాదాపు 6వేల 300కోట్ల రూపాయలను మిగుల్చుకున్నారు. జగన్ ప్రారంభించిన విద్యాదీవెనపేరుకే ఘనంగా ఉన్నా...చెల్లింపుల్లో మాత్రం డొల్ల అని తేలింది. జగన్‌ ఐదేళ్ల పాలనలో పేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల రూపంలో 3వేల174 కోట్ల రూపాయల భారం పడింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలుగా ఫీజులను విడుదల చేయాల్సి ఉండగా...జగన్‌ ఒక్కసారి మాత్రమే బటన్‌ నొక్కారు. అదీ ఉత్తుత్తిదే కావడంతో ఆ ఒక్క త్రైమాసికం ఫీజుల డబ్బులు దాదాపు 50% మందికి ఇప్పటికీ బ్యాంకు ఖాతాల్లో పడలేదు. మరో మూడు త్రైమాసికాల ఫీజును బకాయి పెట్టి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అప్పుల్లోకి నెట్టేశారు.

ఈ ఏడాది మూడు విడతలకు సంబంధించి 2వేల124 కోట్ల ఫీజులు విద్యార్థులే కట్టుకున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికానికి బటన్‌ నొక్కినా...ఇంత వరకూ తల్లుల ఖాతాల్లో ఫీజులు జమ కాలేదు. వసతి దీవెన కింద డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఇచ్చే 20వేల రూపాయలు రాకపోగా...2022-23 సంవత్సరానికి ఒక విడత ఎగ్గొట్టారు. ఫీజు చెల్లించకపోతే హాల్‌టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story