YCP: మరీ ఇంత బరితెగింపు మాటలా...?

రాజకీయాల్లో మాటకు ఉన్న బరువు, బాధ్యత మరోసారి స్పష్టమైంది. వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విమర్శలు ఒక హద్దులో ఉంటేనే ప్రజాస్వామ్యంలో అంగీకారయోగ్యమవుతాయన్న వాదనకు ఆయన తాజా పరిణామాలు ఉదాహరణగా మారాయి. అవతలివారిని వ్యంగ్యంగా మాట్లాడటం, నాటకీయ సంభాషణలతో సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాంబాబుకు అదే శైలి ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శల స్థాయిని దాటి వ్యక్తిగత దూషణలుగా మారాయని ప్రత్యర్థి పార్టీల శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా తమ పార్టీ అధినేతపై తీవ్ర పదజాలంతో చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై లేదా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు సహజమేనని, కానీ వ్యక్తిగతంగా దూషించడం అసహ్యకరమని వారు అంటున్నారు.
ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో టీడీపీ, కూటమి శ్రేణులు అంబటి రాంబాబు నివాసం వైపు తరలివచ్చారు. మహిళలు, దివ్యాంగులు సైతం నిరసనలో పాల్గొనడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. ఈ ఘటనతో రాంబాబు వ్యాఖ్యలపై రాజకీయంగా మాత్రమే కాకుండా, సామాజికంగా కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వరుస ఘటనలతో అంబటి రాంబాబు రాజకీయ ప్రవర్తనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మాటల నియంత్రణ లేకపోతే రాజకీయంగా మాత్రమే కాకుండా, న్యాయపరమైన చిక్కులు కూడా తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే ప్రజల నాడి పట్టుకోవాలి కానీ, తాడేపల్లి ప్యాలెస్ మెప్పు కోసం చూడకూడదు. ఇప్పటికైనా వైకాపా నేతలు వాస్తవాలను గ్రహించకపోతే, రాబోయే రోజుల్లో వారు రాజకీయంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. బూతులతో బతుకుదెరువు వెతుక్కునే ప్రయత్నం చేస్తే, ప్రజలు వారిని శాశ్వతంగా పక్కన పెట్టేస్తారు. ఆ విషయం ఇప్పటికే నిరూపితమయింది. అయినా ఈ నేతలకు తెలియడం లేదు. తెలుసుకున్న చాలా మంది సైలెంటుగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
