YCP: అధికారిపై దాడి ఘటనతో ఆత్మరక్షణలో వైసీపీ

గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నేత దాడి తర్వాత జరిగిన పరిణామాలతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఈ ఘటనను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తీవ్రంగా పరిగణించడం, దళిత అధికారిపై దాడిని ఉద్యోగవర్గాలు జీర్ణించుకోలేకపోవడం వైసీపీని ఇరకాటంలో పడేశాయి. వైసీపీ అధికారం కోల్పోయినా ఆ పార్టీ నేతల్లో అధికార అహంకారం తగ్గలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించడంతో పోలీసులు ప్రధాన నిందితులను పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలన్నీ వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారాయి. కీలక నిందితుడు జల్లా సుదర్శన్‌రెడ్డి వైసీపీలో కీలక పదవులు అనుభవించడంతోపాటు చట్టాలపై అవగాహన ఉన్న వ్యక్తి అయినా ఆయన ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలొచ్చాయి. ఈ దాడిపై ఉద్యోగవర్గాల నుంచే కాకుండా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను వైసీపీ మూటగట్టుకుంది.
జనసేనలోకి కీలక నేత
వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ ఘోర ఓటమి తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా వైసీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సంధ్యా విక్రమ్ కుమార్ కూడా తగినంత ప్రాధాన్యత లేకపోవడంతో పార్టీని వీడి జనసేన కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. 12 ఏళ్ల పాటు వైసీపీ కోసం పనిచేసిన విక్రమ్ వీడడం శ్రేణుల్లో అయోమయానికి కారణమైంది.
వైసీపీని వీడేందుకు కీలక నేత సిద్ధం..?
YCPలో ఇప్పుడు ఒక్కొక్కరూ తమదారి తాము చూసుకుంటున్నారు. ఎవరికి నచ్చిన శిబిరంలో వారు చేరిపోతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు వైసీపీని వీడి వివిధ పార్టీల్లో చేరగా.. తాజాగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పార్టీని వీడనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన సొంత నియోజకవర్గం ఆముదాలవలసకి YCP కొత్త ఇంచార్జిని పెట్టింది. దాంతో అసంతృప్తితో ఉన్న తమ్మినేని ఫ్యామిలీ జనసేన వైపు చూస్తోందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com