KAKANI: మాజీ మంత్రి కాకాణిపై లుకౌట్ నోటీసులు

వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఈ చర్యలు తీసుకున్నారు. అన్ని ఎయిర్‌పోర్టులు, సీపోర్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు పోలీసులు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాణి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఇప్పటికే క్వార్ట్జ్ అక్రమ తరలింపు, అట్రాసిటీ, పోలీసులను దూషించిన కేసులను నమోదు చేశారు.తన అనుచరులతో కలిసి విదేశాలకు కలిసి రూ.250 కోట్లకుపైగా విలువ చేసే క్వార్ట్జ్ ఎగుమతి చేసినట్లు ఆరోపణలున్నాయి.
కాకాణి కనిపిస్తే అరెస్ట్
క్వార్డ్జ్ అక్రమ తవ్వకాల కేసులో కాకాణిపై కేసు నమోదు కావడం, విచారణకు రావాలని ఎన్ని సార్లు నోటీసులిచ్చినా లెక్కచేయకపోవడం.. వాటిని తీసుకునేందుకు ఇళ్లలోనే ఉండకపోవడం.. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడం.. తదితర పరిణామాల క్రమంలో గత కొద్ది రోజులుగా కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా హైకోర్టు బుధవారం ఆయన బెయిల్ పిటిషన్‌ను డిస్మస్ చేయడంతో.. అరెస్టు చేయడానికి పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఉధృతంగా గాలిస్తున్నారు. ఏడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో సైతం వేటాడుతున్నట్లు సమాచారం. కాకాణి కనిపించడమే తరువాయి.. అరెస్టు చేయడం ఖాయమని పోలీసు వర్గాలు అంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com