AP: కదులుతున్న జోగి రమేశ్‌ అక్రమాల డొంక

AP: కదులుతున్న జోగి రమేశ్‌ అక్రమాల డొంక
X
జోగి రమేష్ కుమారుడిపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన ఏసీబీ

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుటుంబం అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జోగి రమేశ్‌ అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విజయవాడ రూరల్‌లోని అంబాపురం గ్రామంలో సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను జోగి రమేశ్‌ కుమారుడు జోగి రాజీవ్, బాబాయ్‌ జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేశారు. ఆ భూమి రికార్డులను తారుమారు చేసి సర్వే నంబరు కూడా మార్చేశారు. సర్వే నంబర్‌ 88లోని భూమి కొని.. దానిని సర్వే నంబర్‌ 87లోకి మార్చాలంటూ రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి తెచ్చారు. జోగి బాబాయ్, తనయుడి పేరిట గత ఏడాది ఏప్రిల్‌ 29న స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దొంగ పత్రాలు సృష్టించారు. అదే భూమిని మే 31న పడిగిపాటి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించారు.


గ్రామ సర్వేయర్‌ దేదీప్య ఎటువంటి సర్వే నిర్వహించకముందే సర్వే చేసినట్లు దొంగ రికార్డులు సృష్టించారు. సర్వే సమయంలో సరిహద్దు దారులైన అద్దేపల్లి కిరణ్‌, రాంబాబులకు నోటీసులు ఇచ్చి వాళ్లు కూడా నిర్ధరించినట్లు కట్టు కథలు చెప్పారు. అగ్రిగోల్డ్‌ సంస్థ ఫిర్యాదుతో డొంక కదిలి.. జోగి రమేశ్‌ కుటుంబ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి ఆధారాలతొనే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టి ఆయన కుమారుడు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

జోగి రాజీవ్‌ అరెస్ట్‌

జోగి ఇంట్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏ1గా జోగి రమేశ్‌ కుమారుడు : జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఏ1గా జోగి రాజీవ్, ఏ2గా జోగి వెంకటేశ్వరావులను ఎఫ్‌ఐఆర్ చేర్చారు. ఎఫ్‌ఐఆర్‌లో మండల సర్వేయర్‌ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య పేర్లు అలాగే నున్న సబ్‌ రిజిస్ట్రార్‌ వి.నాగేశ్వరరావును చేర్చారు.సెక్షన్ 120బీ, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 సెక్షన్ల కింద, అలాగే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు చేశారు.అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆగస్టు 8న కేసు నమోదు చేశారు. అవ్వ వెంకట శేషు నారాయణ ఫిర్యాదుతో విజయవాడ వెస్ట్ ఏసీపీ విచారించారు. విచారణ నివేదికను గతంలోనే డీజీపీకి ఎన్టీఆర్ జిల్లా సీపీ సమర్పించారు. మండల, గ్రామ సర్వేయర్లు తప్పుడు సర్వే చేశారని విజయవాడ పోలీసుల నివేదించారు. విజయవాడ పోలీసుల నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది.

Tags

Next Story