వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రేవతి వీరంగం.. బీసీ సంక్రాంతి సభ వాయిదా?

వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రేవతి వీరంగం.. బీసీ సంక్రాంతి సభ వాయిదా?

విజయవాడలో శుక్రవారం జరగాల్సిన బీసీ సంక్రాంతి సభ వాయిదా పడింది.. వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రేవతి తీరు కారణంగానే సభ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.. ఈ సభను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేస్తోంది.. శుక్రవారం సభలో 56 బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లతో ప్రమాణం చేయించేలా సన్నాహాలు చేస్తోంది. ఈ సమయంలో కాజా టోల్‌ ప్లాజా దగ్గర రేవతి సృష్టించిన వీరంగం అధికార పార్టీ నేతల పరువు తీసింది. ఈ పరిస్థితుల్లో సభ నిర్వహించడం కంటే వాయిదా వేసుకోవడమే ఉత్తమం అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గుంటూరు జిల్లా కాజ టోల్‌ప్లాజా సిబ్బందిపై ఆంధ్రప్రదేశ్‌ వడ్డెర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌ రేవతి దాడి చేయడం సంచలనంగా మారింది. అధికారదర్పంతో ఆమె టోల్ సిబ్బందిపై చేయిచేసుకున్నారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టోల్‌ గేట్ సిబ్బంది మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కంప్లైంట్ చేసే విషయంపై మొదట్లో తటపటాయించినా చివరికి ఫిర్యాదు చేయాలనే నిర్ణయించుకున్నారు. PSలో టోల్‌గేట్ సిబ్బంది కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దీనిపై విచారణ మొదలుపెట్టారు.

కాజ టోల్‌గేట్ వద్ద ప్రత్యేక లైన్ నుంచి తన వాహనం అనుమతించకపోవడంతో రేవతి ఆగ్రహంతో ఊగిపోయారు. కారు దిగి వచ్చి, అక్కడి సిబ్బందిపై చెయ్యి చేసుకున్నారు. నోటికొచ్చినట్టు తిట్టి వాళ్లపై జులుం ప్రదర్శించారు. తన వాహనాన్నే ఆపుతారా అంటూ ఆగ్రహించి బీభత్సం సృష్టించారు. బలవంతంగా తానే బారీకేడ్లను పక్కకు లాగేయడమే కాదు.. అక్కడి సిబ్బందిపై విరుచుకుపడ్డారు.

వడ్డెర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌ రేవతి గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ గొడవ జరిగింది. మినహాయింపు ఇచ్చే వాహనాల లిస్ట్‌లో ఈ వాహనం లేనందున తాము ఏమీ చేయలేమని టోల్ సిబ్బంది చెప్పడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. సిబ్బందిపై చెయ్యి చేసుకున్నారు. బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉంది కూడా రేవతి ఇలా రెచ్చిపోయి దాడికి దిగడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ అంటూ బోర్డు కారుకు పెట్టుకున్నంత మాత్రాన నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం సరికాదని అంటున్నారు.

ఐతే.. టోల్ సిబ్బందిపై చెయ్యి చేసుకున్న రేవతి ఈ వివాదంలో తన తప్పేమీ లేదంటున్నారు. టోల్‌ప్లాజా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్లే తాను కారు దిగాల్సి వచ్చిందని వివరిస్తున్నారు. తన కారుకు రెగ్యులర్ పాస్ ఉందని చెప్తున్నారు. తాను చట్ట ప్రకారం నడిచుకునే వ్యక్తినే తప్ప.. ఇలా ప్రవర్తించడం తన ఉద్దేశం కాదంటున్నారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.

YCP Leader

Tags

Read MoreRead Less
Next Story