ఏపీలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది : చంద్రబాబు

ఏపీలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది : చంద్రబాబు
ఏపీలో వరుసగా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్ష కార్యకర్త, సొంత పార్టీ కార్యకర్త అని తేడా లేదు.. ఎక్కడ చూసినా బడుగులు ఆత్మగౌరవ..

ఏపీలో వరుసగా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్ష కార్యకర్త, సొంత పార్టీ కార్యకర్త అని తేడా లేదు.. ఎక్కడ చూసినా బడుగులు ఆత్మగౌరవ పోరాటం చేయాల్సి వస్తోంది. గుంటూరు జిల్లాలో ఓ దళిత యువకుడిపై దాడి ఘటన సంచలనంగా మారింది. బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో ఎస్సీ యువకుడిపై అగ్రవర్ణాలకు చెందిన వారు దాడి చేసారనే వార్తతో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి.

దళిత యువకుడిపై దాడిని వామపక్ష నిజనిర్ధారణ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు, అంబేద్కర్ సేవా సమాజం, వామపక్షాలతోకూడిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు మరుప్రోలువారిపాలెం ఇందిరానగర్ దళితవాడను సందర్శించారు. దళిత యువకుడు దాసరి భాస్కర్ కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దళిత యువకుడిపై దాడిచేసిన అగ్రవర్ణానికి చెందిన 30 మంది యువకులను వెంటనే అరెస్టుచేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడి చేయడమే కాకుండా కులంపేరుతో దూషించిన వారిపై దిశా కేసుతోపాటు ఎస్సీ, స్టీ కేసు నమోదు చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజీకి ఒత్తిడి తెస్తున్నారని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆరోపించారు.

మరోవైపు ఈ ఘటనలో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేయగా, తాజాగా మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు వాలంటీర్లు కూడా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బాపట్ల డీఎస్పీ తెలిపారు.ఇది అటుంచితే, గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి దళిత బాధితుడు భాస్కర్‌కు మధ్య జరిగిన సంభాషణ ఆడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. గొడవకు సంబంధించి ఊళ్లో సంగతి ఊళ్లో చూసుకోవాలిగానీ బయటివాళ్లు ఎందుకంటూ కోన రఘుపతి అన్నారని బాధితుడు అంటున్నాడు.

మరోవైపు ఏపీలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదన్నారు. ప్రాథమిక హక్కులే కాదు, జీవించే హక్కులను కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును నొక్కేయాలని చూడకూడదంటూ పోలీసులను ఉద్దేశిస్తూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. బాధిత వర్గాలకు అండగా పోలీసు వ్యవస్థ ఉండాలన్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story