YCP: ఎన్నికల ప్రలోభాలకు వైసీపీ కొత్త పంథా!

ఎన్నికల ప్రలోభాల్లో వైసీపీ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. సొంత పార్టీ నేతలకే కరెన్సీ కట్టల ఎరవేస్తోంది. ఓటర్లను ప్రభావితం చేసే నాయకుడి స్థాయిని బట్టి ఒక్కొక్కరికి 50 వేల నుంచి 15 లక్షల వరకూ పంపిణీ చేస్తున్నారు. అవినాష్‌రెడ్డి సారథ్యంలో జగన్ ఇలాకాలోనే ఈ కార్యక్రమం అమలవుతోంది. వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ సొంత పార్టీ నాయకులనే కొనేస్తున్నారు. ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా పులివెందులలో కార్యకర్తకు జగన్ భరోసా పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీన్ని తెరవెనుక నడిపించేది ఎవరైనా తెరముందు అవినాష్‌రెడ్డే అన్నీతానై చూసుకుంటున్నారు. నియోజకవర్గంలోని 7మండలాల నేతల జాబితాను సిద్ధం చేసి వారికి డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
ఊరికే ఇస్తున్నారనే అనుమానం లేకుండా"కార్యకర్తకు జగనన్న భరోసా" పేరుతో ఎంపీ అవినాష్ రెడ్డికి ఓ అర్జీ పెట్టుకునేలా ఫారం రూపొందించారు. వాటిలో వైసీపీ నాయకుడే తాను సమస్యల్లో ఉన్నానని, తనకు సహాయం చేయాలని కోరినట్లు రాయిస్తారు. వైసీపీ సదరు నేత హోదాను బట్టి లక్ష రూపాయలు లేదా 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇంకా కీలకమైన నేత అయితే 10 లక్షల రూపాయల వరకు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. సింహాద్రిపురం మండలంలో.. ఓ వైకాపా నేతకు పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బు జగనన్న ఇచ్చారని.... అవినాష్ రెడ్డి వారికి స్వయంగా చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పులివెందుల, లింగాల, వేంపల్లె, వేముల, సింహాద్రిపురం మండలాల్లో ఒక విడత డబ్బుల పంపిణీ పూర్తయింది. ఇంకా చక్రాయపేట, తొండూరు మండలాల్లో పంపిణీ చేయాల్సి ఉందని చెప్తున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దే మరోసారి భారీగా పార్టీ నాయకులకు నగదు పంపిణీ చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొండూరు మండలంలో ఈనెల 26న ఎంపీ అవినాష్ రెడ్డి మహిళలకు రహస్యంగా చీరలు పంపిణీ చేశారనే ప్రచారమూ సాగుతోంది.
మరోవైపు పాలనలోనే కాదు పార్టీ వ్యవహారాల్లోనూ రివర్స్ విధానాన్నే వైసీపీ కొనసాగిస్తోంది. గత నెల నుంచి మొదలుపెట్టిన నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల కసరత్తులోఇప్పటి వరకు నాలుగు జాబితాలను విడుదల చేశారు. ఆ జాబితాల్లోని కొందరిని మళ్లీ ఇప్పుడు జగన్ మారుస్తున్నారు. మాట తప్పను మడమ తిప్పను అని పదే పదే ఊదరగొట్టే జగన్ ఒక్కసారి కూడా మాటమీద నిలబడింది లేదని ఆపార్టీ నేతలే ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు. దాదాపు నెలరోజులపాటు నియోజకవర్గాల సమన్వయకర్తలను మారుస్తూ సొంత పార్టీ నేతలతో ఫుట్ బాల్ ఆడుకున్న జగన్ ఇప్పుడు జాబితాలో ఉన్న వారినీ ఉంచేలా కనిపించడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com