Nara Lokesh: టెన్త్ విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్.. మధ్యలో వైసీపీ నేతలు..

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. టెన్త్ విద్యార్థులతో జరిపిన జూమ్ మీటింగ్‌లోకి వైసీపీ నేతలు ప్రత్యక్షమై అడ్డుతగిలారు. జూమ్ మీటింగ్‌లోకి పలువురు విద్యార్థుల ఫోన్ నెంబర్లతో వల్లభనేని వంశీ, కొడాలి నాని, పలువురు నేతలు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు లాగిన్ అయ్యారు. దీనిపై లోకేష్ ఫైరయ్యారు. వైసీపీ నేతలు తమ నీతిని చాటుకున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో గతంలో ఎన్నడూలేని విధంగా టెన్త్ ఫలితాల్లో అతితక్కువ ఉత్తీర్ణతాశాతం నమోదైంది. రెండు లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు తప్పడంతో.. అన్ని వైపుల నుంచి జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి జరిగింది. ఈ క్రమంలో టెన్త్ ఫలితాలపై నారా లోకేష్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు జూమ్‌లోకి వచ్చి మాట్లాడుతుండగా.. సడెన్‌గా కొడాలినాని, వంశీ, వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. విద్యార్థిల పేర్లతో వీరు లాగిన్ అయ్యారు.
నవ్య తోట పేరుతో వంశీ, కార్తిక్ కృష్ణ పేరుతో కొడాలి నాని.. తమ ఆఫీసుల్లో నుంచే ల్యాప్‌టాప్‌లతో లాగిన్ అయి లైవ్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వంశీ, కొడాలి నానిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పేర్లతో ఎందుకు రావాల్సి వచ్చింది..? దమ్ముంటే నేరుగా చర్చకు రావాలని ఆ ఇద్దరికీ లోకేష్ సవాల్ విసిరారు. జూమ్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారని టీడీపీ నేతలు లోకేష్ దృష్టికి తేగా.. వైసీపీ నేతలు ఉన్నా పర్లేదు, ప్రభుత్వం ఫెయిల్యూర్ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది టెన్త్ రాసిన విద్యార్థులకు మాత్రమే జూమ్ మీటింగ్ అని, ఎప్పుడో పది తప్పిన, పద్దతి తప్పిన వైసీపీ కుక్కలకు కాదంటూ లోకేష్ చురకలు అంటించారు.ప్రభుత్వ చేతగాని తనం వల్లే విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిలయ్యారన్నారు. వైసీపీ నేతలు దొంగ ఐడీలతో కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తారా అని లోకేష్ అగ్రహం వ్యక్తం చేశారు. జూమ్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన లోకేష్... తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని అభయమిచ్చారు.
విజనరీ చంద్రబాబు, ప్రిజనరీ జగన్‌కు మధ్య ఉన్న తేడానే పదో తరగతి ఫలితాలని లోకేష్ ఎద్దేవా చేశారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ, ఉత్తీర్ణతపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. పరీక్ష తప్పామని పలువరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com