YCP: వైసీపీలో నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి

YCP: వైసీపీలో నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి
X
11మంది నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పుపై అసహనం... ఇప్పటికే రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధిష్ఠానం నియోజకవర్గ ఇంఛార్జులను మార్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న విడుదల రజనీ, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్‌కు మళ్లీ విజయావకాశాలు లేవని ఐ-ప్యాక్‌ సర్వేల్లో తేలడంతో వారి స్థానాల్లో కొత్త ఇంఛార్జులను నియమించారు. పార్టీ నియమించిన ఇంఛార్జుల్లో కొత్త వారికి నలుగురికే చోటు కల్పించడంతో కచ్చితంగా తమకే సీటు అని భావించిన కొంతమందికి షాక్‌ ఇచ్చినట్లయింది. 11 మార్పుల్లో కేవలం ఉమ్మడి గుంటూరు నుంచే 8 ఉండటంతో జిల్లా రాజకీయం మరింత వేడెక్కింది. దీంతో ఇంఛార్జుల మార్పు పట్ల అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. చిలకలూరిపేట, వేమూరు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడుదల రజని, మేరుగ నాగార్జునను తప్పించి వారి స్థానంలో కొత్తవారని తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

11 నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుతో ఆ పార్టీ అసంతృప్తి భగ్గుమంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీకీ రాజీనామా చేశారు. గాజువాక టికెట్‌ ఆశించి పనిచేసుకుంటున్న సిటింగ్‌ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్‌రెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే అయితే ఫోన్‌ స్విచాఫ్‌ చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అసహనానికి లోనై తీవ్రమైన చర్యకు పాల్పడేందుకు సిద్ధమయ్యారు. ఈ 11 సీట్లలో సమన్వయకర్తల మార్పు వెనుక డబ్బు, లాబీయింగ్‌ గట్టిగా పనిచేసిందని ప్రచారం సాగుతోంది. ఒక కాంట్రాక్టరు 50 కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటానంటే.. ఆయనకో నియోజకవర్గాన్ని అప్పగించారని ఇద్దరు మాజీ మంత్రులకు సొమ్ము ముట్టజెప్పిన ఒకరికి మరో నియోజకవర్గం అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. ఒక మంత్రి లాబీయింగ్‌తో మరో నాయకుడికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

సిట్టింగులపై వ్యతిరేకతే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను అధికారం నుంచి దూరం చేసిందని భావించిన జగన్‌ ఇంఛార్జులుగా నాలుగు కొత్త ముఖాలను పంపి కొంత నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారనే చర్చ జరుగుతోంది. అయితే కొత్తవారితో పార్టీకి మైలేజీ రాకపోగా నియోజకవర్గాల్లో కొత్త గ్రూపులు పెరిగే అవకాశముందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు స్థానిక పరిస్థితుల పట్ల అవగాహన లేని ఐ ప్యాక్‌ చేసే సర్వేలు, చెప్పే థియరీలతో ఇష్టారీతిన మార్చేస్తున్నారని కొత్త వారికి తాము మద్దతు ఇవ్వకపోతే నెల రోజుల్లో మళ్లీ రివర్స్‌ కావాల్సిందనని పాత సమన్వయకర్తలు వాపోతున్నారు. మంగళగిరి MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయగా చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని వైకాపా ఇంఛార్జిగా నియమించారు. అదే వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ MLA కాండ్రు కమల టికెట్‌ ఆశించారు. వారిని పట్టించుకోకుండా చిరంజీవిని నియమించడంపై కాండ్రు కమల వర్గీయులు గుర్రుమంటున్నారు. ఆర్కేను సముదాయించే బాధ్యత ఆయన సోదరుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి అప్పజెప్పారు. ఆయన రంగంలోకి దిగి సముదాయించే ప్రయత్నం చేయగా....ఆళ్ల రామకృష్ణారెడ్డి వినలేదు. పైగా ఆయన ముందే టైర్లు తగలబెట్టి ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. గంజి చిరంజీవికి టికెట్‌ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. చేసేదిలేక అయోధ్యరామిరెడ్డి వెనుదిరిగారు.

Tags

Next Story