YCP LEADERS: విజయవాడ జైలులో వైసీపీ నేతల వీరంగం

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదల అయ్యారు. వీరి రిలీజ్ సందర్భంగా విజయవాడ సబ్ జైలు వద్ద దాదాపు మూడు గంటల పాటు హైడ్రామా కొనసాగింది. అధికారులు జాప్యం చేయడంతో జైలు బయట న్యాయవాదులు, లోపల నిందితులు ఆందోళనకు దిగారు. ఉద్రిక్తతల నేపథ్యంలో నిందితులను జైలు అధికారులు బయటకొచ్చారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో సీఎంవో మాజీ కార్యదర్శి కె. ధనంజయ రెడ్డి ఏ 31గా, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఏ32గా, బాలాజీ గోవిందప్ప ఏ33గా ఉన్నారు. వీరికి విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం నాడు బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదల ఆలస్యమైందంటూ వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. నిందితులు బయటకు వచ్చేలోపు జైలు వద్దకు చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఉదయం 7 నుంచి 10 గంటల మధ్యలో వారిని విడుదల చేస్తామని అధికారులు ముందురోజే చెప్పినా వైసీపీ నేతలు వినలేదు. వైసీపీ నాయకులు, వారి అనుచరులు, లీగల్ సెల్ న్యాయవాదులు, విద్యార్థి సంఘం నేతలు ఆదివారం తెల్లవారుజామున 5.30కే జైలు వద్దకు చేరుకుని హడావుడి మొదలెట్టారు. సిబ్బంది సర్దిచెప్పినా వినకుండా తాము వచ్చిందే గొడవ చేయడానికన్నట్లుగా రెచ్చిపోయారు. రోడ్డుపై బైఠాయించి, జైలు తలుపులను బాదుతూ నానా హంగామా చేశారు. ఇదే కేసులో అరెస్టయి జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి లోపలి నుంచే పెద్దగా అరవడం మొదలుపెట్టగా.. బయటి నుంచి నేతలు వంత పాడారు.
బెయిల్ మంజూరైన ముగ్గురు నిందితుల కంటే ఎక్కువగా.. ఇదే కేసులో అరెస్టయి జైలులో ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి రెచ్చిపోయారు. ‘ఎందుకు వదలడం లేదు? మీకేం హక్కుంది? కావాలనే కుట్రలు చేస్తున్నారా? మిమ్మల్ని ఎవర్నీ వదిలిపెట్టం’ అని బెదిరించారు. గోవిందప్ప బాలాజీ తలను గోడకు కొట్టుకున్నట్టు నటించి అరుపులతో హడలెత్తించారు.
హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు..?
లిక్కర్ స్కాం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు జారీ చేసిన బెయిల్ పై ప్రాసిక్యూషన్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని మరికాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com