YCP: వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఒక్కొక్కరుగా పార్టీ నుంచి దూరమవుతున్నారు. వైసీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీలో అనిశ్చితికి తాను కారణం కాదన్నారు. పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేశానని స్పష్టంచేశారు. ఏ పార్టీలో చేరే అంశంపై స్పష్టత ఇవ్వలేదు.
జగన్ సతమతం
వైసీపీలో అంతర్గత తిరుగుబాటు మొదలైంది. పార్టీ విధేయులుగా ఉంటూ కష్టపడినా ఈసారి జగన్ మొండిచేయి చూపడంతో వారంతా తమ సత్తా చూపుతున్నారు. తమను కాదని ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని తెలిపేందుకు బలనిరూపణకు దిగారు. మరికొందరు ఒకడుగు ముందుకేసి పార్టీ అండలేకున్నా ప్రజా మద్దతు తమకే ఉందని చాటుతూ వైసీపీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల ముందు ఎమ్మెల్యేల తిరుగుబావుటా ఎగురవేయడంతో అధిష్టానం కాళ్లబేరానికి వచ్చింది. ఎమ్మెల్సీ సహా కీలక పదవులిస్తామంటూ బుజ్జగింపుల పర్వానికి దిగుతోంది.
వైసీపీ అధిష్టానం ఇష్టానుసారం రాజకీయ బదిలీలకు తెరలేపగా...టిక్కెట్లు కోల్పోయిన అసంతృప్త ఎమ్మెల్యేలు అధినాయకత్వంపైనే నేరుగా యుద్ధం ప్రకటిస్తున్నారు. మీరు చేసేదే మీరే చేస్తే ఏం చేయాలో మాకు తెలుసంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తమను కాదని నియోజకవర్గాల్లో ఎన్నికలకు ఎలా వెళ్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. భారీ బలప్రదర్శనలతో పరపతి చాటుతున్నారు. ఈనెల 12న పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 30 వేల మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి ఈ స్థాయిలో ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం విశేషం. నాకు జన బలముందని...పిఠాపురం సీటు విషయంలో జగన్ పునరాలోచించుకోవాలని ఆయన నేరుగానే అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సైతం అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి కాకినాడ పర్యటనకు సైతం ఆయన వెళ్లలేదు. అదే దారిలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సైతం సీఎం సభకు దూరంగా ఉన్నారు. ఆయన బయటపడపోయినా... అంతర్గతంగా చేయాల్సిన పనులు చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గాల్లో కొత్తగా నియమితులైన తోట నరసింహం, విప్పర్తి వేణుగోపాల్‌కు సహాయ నిరాకరణ భయం పట్టుకుంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ‘ప్రజా దీవెన’ పేరుతో పోరుబాటు పట్టారు. ఈనెల 12 నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా మొబైల్ యాప్‌తో జనం మద్దతు కూడగడుతున్నారు. వరుపుల సుబ్బారావును సమన్వయకర్తగా నియమించినా....టిక్కెట్ మాత్రం తనదేనని దీమా వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com