ఎవరికీ భయపడి పర్యటన వాయిదా వేసుకోలేదు : రఘురామకృష్ణరాజు

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పశ్చిమగోదావరి జిల్లా పర్యటన వాయిదా పడింది. భీమవరానికి వెళ్లాల్సిన తనను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నారని రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. ఇప్పటికే చాలా చోట్ల గో బ్యాక్ అంటూ ఆందోళనలు చేస్తున్నారని, పలువురిపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. ఆచంట వద్ద తనను అరెస్ట్ చేసేందుకు మంత్రి రంగనాథరాజు.. వైవీ సుబ్బారెడ్డితో కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు.
తాను నియోజకవర్గంలోకి వస్తే.. తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. తన పర్యటనను అడ్డుకోవడానికి జరుగుతున్న కుట్ర గురించి సీఎంవోకు, సీఎం పీఏకు చెప్పేందుకు ప్రయత్నించినా.. ఎవరూ స్పందించడం లేదని అన్నారు. ఎవరికీ భయపడి పర్యటన వాయిదా వేసుకోలేదని.. 48 గంటల్లో పర్యటన గురించి చెబుతానని చెప్పారు.
అధికార యంత్రాంగాన్ని, పోలీసుల్ని అడ్డు పెట్టుకుని అరెస్టు చేయాలని కుట్ర పన్నారా అని రఘురామ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంతకు ముందు ఎన్నడూలేని విధంగా ఓ వర్గానికి చెందిన అధికారుల్ని నియమించుకున్నారని చెప్పారు. ఇదంతా జగన్‌కు తెలిసి జరుగుతోందా? తెలియకుండా జరుగుతోందా? అని ప్రశ్నించారు. ఒక ఎంపీపై కుట్ర చేసే అథమ స్థాయికి సీఎం వెళ్లరు అనే భావిస్తున్నా అని అన్నారు. లాయర్లతో మాట్లాడి కోర్టును ఆశ్రయించడంపై ఆలోచిస్తానని... నర్సాపురం వెళ్తానని రఘురామ స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com