YCP: రోజాకు సొంత నేతల వార్నింగ్

మాజీ మంత్రి, వైసీపీ నేత రోజాకు సొంత నియోజకవర్గం నగరిలోని స్థానిక నేతలు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. రోజా రాజకీయ భవిష్యత్తు ముగిసిందని, ఇక ఆమె జీవితంలో ఇక్కడ గెలవలేరని స్పష్టం చేశారు. రోజా అహంకారంతో మాట్లాడుతున్నారని, ఆమె రాజకీయ జీవితం తాము పెట్టిన భిక్షేనని మండిపడ్డారు. శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీపీ ఎన్నికలు న్యాయబద్ధంగానే జరిగాయని, 'ఓ అబ్బకు పుట్టావా' అని రోజా మాట్లాడటం బాధాకరమని అన్నారు. నియోజకవర్గ చరిత్రలోనే అత్యంత దారుణంగా ఓడిపోయింది రోజానే అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రోజా ఫస్ట్రేషన్తో మదమెక్కి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి పార్టీ మారి, తమ దయతోనే రోజా ఎమ్మెల్యే అయ్యారని గుర్తు చేశారు. అమ్ములు మాట్లాడుతూ.. తాము సాయం చేస్తేనే రోజా నిలబడ్డారని, ఆమె, ఆమె కుటుంబం నగరిని దోచుకున్నారని ఆరోపించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్ పోరు
కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తన ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఇందులో భాగంగా చేపట్టిన 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమానికి సంబంధించి, జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వరకు వాహన ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర డీజీపీకి అధికారికంగా లేఖ రాసింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ మేరకు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన కోటి సంతకాల పత్రాలు ఈ నెల 10వ తేదీనే జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. వీటిని డిసెంబరు 15న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించాల్సి ఉంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి వరకు వాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఈ ర్యాలీలు, సంతకాల పత్రాల రవాణా సజావుగా సాగేందుకు అనుమతి అవసరమని, దీని కోసం అన్ని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని లేళ్ల అప్పిరెడ్డి తన లేఖలో డీజీపీని కోరారు.తాడేపల్లికి పత్రాలు చేరుకున్న అనంతరం, డిసెంబరు 18న పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గవర్నర్‌ను కలిసి ఈ కోటి సంతకాల పత్రాలను అధికారికంగా సమర్పిస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి వచ్చిన స్పందనను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లడానికి ఈ కార్యక్రమాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

